prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 10:50 am Digital Edition : PRAJA KSHETRAM

ఓఆర్‌ఆర్ వద్ద పోలీసుల కాల్పులు

ఓఆర్‌ఆర్ వద్ద పోలీసుల కాల్పులు

  • పోలీసులపై కత్తితో దాడి యత్నం..
  • ఆత్మరక్షణలో కాల్పులు, నిందితుడికి గాయాలు

హైదరాబాద్ జులై 02(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) సమీపంలో పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నల్గొండ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు భూష్మి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నల్గొండ సీసీఎస్ పోలీసులు అందిన సమాచారం మేరకు ఆదిభట్ల సమీపంలోని ఓఆర్‌ఆర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళ్తున్న డీసీఎం ఐషర్ వాహనాన్ని ఆపారు. ఈ సందర్భంగా నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో పోలీసులపై దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు అతని కాళ్లకు తగిలాయి. గాయపడిన నిందితుడిని వెంటనే 108 అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పోలీసులు అతడిని నల్గొండకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో నిందితుడిపై నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ హత్య కేసుతో పాటు పదికి పైగా ఆస్తి నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.