కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
కరీంనగర్, జులై 01(ప్రజాక్షేత్రం):నగరంలోని ఆర్టీసీ-2 డిపోలో నిలిపి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనతో డిపోలో ఒక్కసారిగా కలకలం నెలకొంది. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పక్కనే నిలిపి ఉన్న ఇతర బస్సులకు మంటలు వ్యాపించకుండా నిలువరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్, బ్యాటరీ వ్యవస్థలో లోపం లేదా ఇతర సాంకేతిక కారణాలతో మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు సాంకేతిక నిపుణులతో విచారణ చేపట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్నిప్రమాదాలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాటరీ భద్రత, విద్యుత్ వ్యవస్థ పనితీరు, నిర్వహణ ప్రమాణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
