prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 11:55 am Digital Edition : PRAJA KSHETRAM

గుడిసెల్లేని తెలంగాణే లక్ష్యం..

గుడిసెల్లేని తెలంగాణే లక్ష్యం..

  • రెండో విడతలో మరో 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
  • వనపర్తిలో మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  • నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు.. సబ్‌-రిజిస్ట్రార్ భవనం, ప్రెస్‌క్లబ్‌కు హామీ
  • లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు.. నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచన

వనపర్తి, జూలై 08(ప్రజాక్షేత్రం):గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేదకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రాష్ట్రాన్ని గృహరహితులు లేని తెలంగాణగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బుధవారం వనపర్తి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రెండు కోట్లతో చేపడుతున్న పనులకు, పాలిటెక్నిక్ రాజభవనం పునర్ నిర్మాణా పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 8 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. గతంలో నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.9,300 కోట్ల పంపిణీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, మహిళా సంఘాలకు రూ.63 వేల కోట్ల వడ్డీలేని రుణాలు, ఇప్పటికే 72 వేల ఉద్యోగాల భర్తీ, త్వరలో మరో 22 వేల ఉద్యోగాల నియామకం చేపడుతున్నట్లు వివరించారు.

వనపర్తికి ప్రత్యేక ప్రాధాన్యం

వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి ప్రశంసించారు. నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.275 కోట్లు వెచ్చిస్తున్నామని, రెండో విడతలో 2,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు వనపర్తిలో సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ప్రెస్‌క్లబ్ భవనాన్ని కూడా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక, మట్టి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు రెగ్యులరైజేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

అసత్య ప్రచారాలను నమ్మొద్దు.. జూపల్లి

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా సాగుతోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు అనవసరంగా అప్పులు చేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లోనే ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.

హామీలన్నీ అమలు చేస్తున్నాం: వాకిటి

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలందరికీ శాశ్వత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

మరో 2,000 ఇళ్లు కావాలి ఎమ్మెల్యే

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ రెండో విడతలో వనపర్తికి 2,000 ఇళ్లు మంజూరు కావడం ఆనందదాయకమన్నారు. వీటికి అదనంగా మరో 2,000 ఇళ్లు, జిల్లాలోని 32 ఎస్టీ హ్యాబిటేషన్లకు ఒక్కో హ్యాబిటేషన్‌కు 20 చొప్పున 640 ఇళ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. వనపర్తి సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయం, పెబ్బేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, వనపర్తి బైపాస్ పూర్తి, ప్రెస్‌క్లబ్ భవనం, మర్రికుంట రైతులకు ఎన్‌వోసీ, క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ స్కూల్, హాకీ టర్ఫ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కే శివసేన రెడ్డి,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.