టాక్లి లో మరోసారి భగ్గుమన్న వర్గ పోరు..!
- 40 రోజుల వ్యవధిలో రెండవసారి గ్రామంలో గొడవలు
- పలువురికి తీవ్ర గాయాలు, పరారీలో కొందరు..?
- ముందస్తు జాగ్రత్తలు తీసుకోని పోలీసులు..?
బాన్సువాడ, జులై 14(ప్రజాక్షేత్రం):బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం టాక్లి గ్రామంలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది. నెలరోజుల క్రితం గ్రామంలో గెలిచిన సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థుల కుటుంబాల మధ్య ఘర్షణ జరగగా అది మనసులో ఉంచుకున్న ఓ వర్గం మనుషులు మరో వర్గంతో మంగళవారం మరోసారి ఘర్షణకు దిగారు. పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై ఒక్కసారిగా వచ్చి కర్రలు రాడ్లతో దాడి చేయగా ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా కాళ్లు చేతులు విరిగినట్లు సమాచారం. గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పెను ప్రమాదం జరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను గ్రామ పోలీస్ అధికారి ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో అల్లకల్లోలం జరిగిందని ప్రజలు అంటున్నారు. నెల రోజుల క్రితం జరిగిన దాడుల్లో ఇరు వర్గాలపై కేసులు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు గ్రామంలో పరిస్థితులను పసిగట్టలేకపోయారని ప్రజలు మండిపడుతున్నారు. పొలంలో పనిచేసుకుంటున్న కొందరిపై కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగిన వారిని చూసి అక్కడ పనిచేస్తున్న కూలీలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన కొందరిపై కూడా వారు దాడికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు అవ్వగా దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. చివరకు అక్కడకు చేరుకున్న స్థానికులు గాయాల పాలైన వారిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా ఎన్నికల సమయంలో జరిగిన వాటిని మనసులో పెట్టుకొని దాడులకు దిగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వర్గ పోరుతో గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి గ్రామంలోని పరిస్థితులను అదుపులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై రుద్రూర్ సర్కిల్ సిఐ కృష్ణ, కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్ ను వివరణ కోరగా పాత గొడవలను మనసులో పెట్టుకొని కొందరు సర్పంచ్ కుటుంబీకులపై కర్రలతో దాడికి దిగారని ఈ దాడిలో గాయాలైన వారిని చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ వారిపై పలు సెక్షన్ల తో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.