prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 7:13 pm Digital Edition : mohan.sabbasani@gmail.com

పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్

కుషాయిగూడలో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది

బాలికల వాంగ్మూలంతో వెలుగులోకి పోక్సో కేసు

కుషాయిగూడ, జూలై 11(ప్రజాక్షేత్రం):మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఇద్దరు బాలికల అదృశ్యం కేసు దర్యాప్తులో పోక్సో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అజయ్ ఉప్పాల (24)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 1న రాత్రి ఫిర్యాదుదారురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమార్తె ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉదయం కళాశాలకు వెళ్లినప్పటికీ హాజరు కాలేదని కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కళాశాల పరిసరాలు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి ఆరా తీయగా, మరో బంధువైన బాలిక కూడా ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. అదే సమయంలో బంధువైన అజయ్ ఉప్పాల విధులకు వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో పాటు, అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అతనికి చెందిన మోటార్‌సైకిల్ కుషాయిగూడలోని ఓ జూనియర్ కళాశాల వెనుక పార్క్ చేసి ఉండటంతో, ఇద్దరు బాలికలను అతడే తీసుకెళ్లి ఉండవచ్చని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 493/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా బాలికలు, నిందితుడి ఆచూకీని గుర్తించి వారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లు చేర్చి కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.