prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:34 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు..

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు..

  • అభివృద్ధి మాటల్లోనే.. పనులు మాత్రం శూన్యం!
  • ఒక్క కొత్త రోడ్డు కూడా మంజూరు కాలేదు..
  • కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది
  • శంకర్ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

శంకర్‌పల్లి జులై 28(ప్రజాక్షేత్రం):ప్రజలను ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, అందుకు ఎలాంటి పదవి లేదా స్థాయి అవసరం లేదని శంకర్ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ, అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పార్టీ మారారని చెప్పారని, అయితే ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక్క కొత్త రోడ్డు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రశ్నించడం వ్యక్తిగత విమర్శ కాదని, ప్రజల తరఫున బాధ్యతగా నిలదీయడమేనని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ప్రశ్నించే వారి స్థాయిని ప్రస్తావించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే యజమానులని, వారి ప్రశ్నలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని ఆయన అన్నారు. నియోజకవర్గంలో రహదారులు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంట్లో పని చేసే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలా:పిఎసిఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి

  • ప్రశ్నిస్తే కేసులు పెడతారా

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ప్రజలకు కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని మాజీ పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అదేవిధంగా, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు వధువులకు అందిస్తామని ప్రకటించిన తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
శంకర్‌పల్లి మండలంలోని ప్రధాన, గ్రామీణ రహదారులు అధ్వాన్నంగా మారాయని, గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ప్రకటించిన ప్రయోజనాలను అందించడంతో పాటు రహదారులను మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి..?

  • శంకర్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్

మాజీ సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ, స్థాయిని బట్టి మాట్లాడడం సరికాదన్నారు. సర్పంచి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ప్రజాప్రతినిధిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. తాము రోడ్డుపై ప్రజా సమస్యలపై మాత్రమే ప్రశ్నించామని, వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదు:వాసుదేవ్ కన్నా

అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా?..

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బిఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ కన్నా విమర్శించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత వివరాలు తాము ఎప్పుడూ అడగలేదని, ఎవరి రాజకీయ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులకు అన్యాయం జరిగిందని, ఇళ్లు, భూములు ఉన్నవారికే లబ్ధి కల్పించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.