prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:23 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుంతల రోడ్డుపై ఆందోళన..

ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుంతల రోడ్డుపై ఆందోళన..

  • రోడ్ల దుస్థితిపై యువత వినూత్న నిరసన..

కరీంనగర్, జూలై 30 (ప్రజాక్షేత్రం):రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు గుంతలమయంగా మారిన నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి ముందు రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన చేపట్టారు.
ప్రభుత్వాసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా అధ్వానంగా ఉందని నిరసనకారులు ఆరోపించారు. గుండె రోగులు, ప్రసూతులు వంటి అత్యవసర రోగులు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ మాట్లాడుతూ, స్మార్ట్‌సిటీ కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఖర్చయ్యాయో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. నగరంలోని అనేక రహదారులు దారుణ స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ రోడ్ల పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఒకసారి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా రోడ్లపైకి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తే వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయమైన రహదారులను తక్షణమే మరమ్మతులు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.