prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:25 pm Digital Edition : PRAJA KSHETRAM

బాకారం జాగీర్‌లో ఓటర్ల జాబితా గందరగోళం.

బాకారం జాగీర్‌లో ఓటర్ల జాబితా గందరగోళం.

  • ఒకే ఇంటి నెంబర్‌పై 79 ఓట్లు!

మొయినాబాద్‌, జులై 16(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని బాకారం జాగీర్‌లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తీవ్ర అవకతవకలు స్థానికంగా పెను కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియకు గొడ్డలిపెట్టుగా మారిన ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాకారం జాగీర్ పరిధిలోని ఇంటి నెంబర్ 5-1 పై ఏకంగా 79 ఓట్లు నమోదు కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో సదరు ఇంట్లో నివసించే వారి సంఖ్యకు, ఓటర్ల జాబితాలో ఉన్న సంఖ్యకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. మరింత విచిత్రమేమిటంటే.. భౌగోళికంగా యెన్కేపల్లి పరిధి శివారు ప్రాంతాల్లో నివాసముంటున్న పలువురి ఓట్లు సైతం నిబంధనలకు విరుద్ధంగా బాకారం జాగీర్ పరిధిలోని ఈ సింగిల్ హౌస్ నెంబర్‌పైనే నమోదై ఉన్నాయి. ఈ భారీ అక్రమాలను గుర్తించిన గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు తక్షణమే స్పందించి ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బూత్ స్థాయి అధికారులు వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నకిలీ మరియు డూప్లికేట్ ఓట్లను తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి గందరగోళాలు సృష్టించడం ప్రజాస్వామ్యానికే విఘాతమని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.