prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 5:27 pm Digital Edition : PRAJA KSHETRAM

రూ.10 నాణేలతో రూ.1 లక్షా10 బైక్ కొనుగోలు చేసిన యువకుడు

యాదాద్రి భువనగిరి జులై 08(ప్రజాక్షేత్రం):జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తాను కొనుగోలు చేసిన నూతన ద్విచక్ర వాహనానికి సంబంధించిన పూర్తి నగదును ఓ వ్యక్తి పది రూపాయల నాణేల రూపంలో చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిట్యాల మండల కేంద్రంలో ఈ వినూత్న ఘటన వెలుగుచూసింది. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండ రఘుపతి అనే వ్యక్తి, స్థానిక శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేశాడు. వాహనం ధర సుమారు రూ.1.10 లక్షలు కాగా, ఈ మొత్తాన్ని నోట్ల రూపంలో కాకుండా పూర్తిగా పది రూపాయల నాణేల రూపంలోనే చెల్లించాడు. ఇందుకోసం తాను సుదీర్ఘకాలంగా పొదుపు చేసిన నాణేలను బస్తాల్లో నింపి షోరూమ్‌కు తీసుకువచ్చాడు. రఘుపతి తీసుకువచ్చిన నాణేల బస్తాలను చూసి షోరూమ్ సిబ్బంది తొలుత ఆశ్చర్యానికి గురైనప్పటికీ, అనంతరం ఎంతో ఓపికతో వాటిని లెక్కించారు. నగదు మొత్తాన్ని సరిచూసుకున్న తర్వాత సదరు వాహనాన్ని అతనికి అందజేశారు. పది రూపాయల నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉండటంతో ఈ లావాదేవీకి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదు. ఈ అరుదైన దృశ్యాలను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎంతో పట్టుదలతో నగదును పొదుపు చేసి తన కలను నెరవేర్చుకున్న రఘుపతిని, అందుకు సహకరించిన షోరూమ్ సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.