prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 3:03 pm Digital Edition : PRAJA KSHETRAM

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • వనపర్తి రైస్ మిల్లర్స్ యూనియన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి
  • డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
  • నూతన అధ్యక్షురాలు పెద్దమారు ధనలక్ష్మి శేఖర్‌కు ఘన సన్మానం

వనపర్తి, జూలై 19(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ యూనియన్ నూతన అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన పి ధనలక్ష్మి శేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ యూనియన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రైతుల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక భాగస్వాములని, రైతులు పండించిన ధాన్యానికి విలువ జోడించి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడం గొప్ప సేవ అని కొనియాడారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల మధ్య వారధిగా రైస్ మిల్లర్స్ యూనియన్ నాయకత్వం పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు రైస్ మిల్లర్ల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, బియ్యం నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుకోవచ్చన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఐకమత్యంతో పనిచేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ యూనియన్ రాష్ట్రంలోనే ఆదర్శ సంస్థగా ఎదగాలని ఆకాంక్షించిన చిన్నారెడ్డి, నూతన అధ్యక్షురాలు పి ధనలక్ష్మి శేఖర్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.