prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 7:53 am Digital Edition : PRAJA KSHETRAM

వనపర్తి వెంకన్న బ్రహ్మోత్సవాలకు మహా ప్రణాళిక

వనపర్తి వెంకన్న బ్రహ్మోత్సవాలకు మహా ప్రణాళిక

  • మార్చిలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహణకు ఏర్పాట్లు
  • రూ.6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం
  • సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించే యోచన
  • శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వెల్లడి

వనపర్తి, జూలై 03(ప్రజాక్షేత్రం):వనపర్తి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత కార్యాచరణ చేపట్టినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగా మాత్రమే కాకుండా వనపర్తి పట్టణ సాంస్కృతిక వైభవాన్ని రాష్ట్రవ్యాప్తంగా చాటిచెప్పే మహోత్సవాలుగా నిలవాలని ఆకాంక్షించారు. భక్తి, సంప్రదాయం, సేవా భావం కలగలిసి ప్రతి ఒక్కరూ గర్వించేలా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, ఉద్యోగులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, భక్తులు కలిసి పనిచేస్తే ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.6 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధి, ఆలయ పరిసరాల సుందరీకరణ, యాత్రికులకు అవసరమైన సదుపాయాల కల్పన వంటి పనులను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు వివరించారు. ఈ పనులు బ్రహ్మోత్సవాలకు ముందే పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వచ్చే మార్చిలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇంకా ఏడు నెలల సమయం ఉన్నందున ప్రతి నెల సమీక్షా సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి అంశాన్ని ముందస్తు ప్రణాళికతో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా “నా భూతో న భవిష్యత్” అన్న స్థాయిలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతి, సామూహిక సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డు అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరే రాములు, ఎస్ ఎల్ ఎన్ రమేష్, కౌన్సిలర్ ధనలక్ష్మి, బ్రహ్మం చారి,బి కృష్ణ, కౌన్సిలర్లు, జిల్లా, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.