prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 2:41 pm Digital Edition : PRAJA KSHETRAM

విఘ్నేశ్వర పెట్రోల్ పంపులో పెట్రోల్ లో నీళ్లు

విఘ్నేశ్వర పెట్రోల్ పంపులో పెట్రోల్ లో నీళ్లు

  • పెద్దేముల్ లో కలకలం రేపిన కల్తీ పెట్రోల్ సంఘటన
  • డబ్బాలో పోసినా పెట్రోల్ లో నీళ్లు రావడం విశేషం
  • చౌరస్తా లో వాహనం ఆగిపోవడంతో బయటపడిన పెట్రోల్ కల్తీ అనుమానం
  • పెట్రోల్‌లో నీళ్లు వచ్చాయంటూ గ్రామసభలో బాధితుడి ఫిర్యాదు
  • గ్రామసభలో పెట్రోల్ బంక్‌పై ఫిర్యాదు.. అధికారుల దృష్టికి ఘటన
  • అధికారుల ఆదేశాలతో పెట్రోల్ విక్రయాలను నిలిపివేసిన పెట్రోల్ పంపు యజమాని కోహిర్ రవి శంకర్

పెద్దేముల్, జూలై 31(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ గ్రామ శివారులోని విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్‌లో పెట్రోల్‌లో నీరు కలిసివచ్చిందంటూ ఓ వాహనదారుడు గ్రామసభలో ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బాధితుడు ఖాజా మియా తెలిపిన పూర్తి వివరాల ప్రకారం…… పెద్దేముల్ గ్రామానికి చెందిన ఖాజా మియా శుక్రవారం ఉదయం సుమారు 8:30 గంటలకు పెద్దేముల్ గ్రామ శివారులోని విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్‌(పెట్రోల్ పంపు)లో తన ద్విచక్ర వాహనానికి రూ.150 రూపాయల విలువైన పెట్రోల్ నింపించుకున్నాడు.అనంతరం పొలానికి క్రిమిసంహారక మందును పిచికారీ చేయడానికి వాడే పెట్రోల్ పంపు మోటారు లో వేయడానికి మరో రూ.50 విలువైన పెట్రోల్‌ను ఒక అర లీటర్ డబ్బాలో తీసుకున్నాడు. అయితే డబ్బాలోని పెట్రోల్ ను పరిశీలించగా పెట్రోల్‌తో పాటు నీరు కూడా ఉన్నట్లు గుర్తించి వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే సిబ్బంది అప్పటికే అప్రమత్తమై డబ్బాను అక్కడి నుంచి తీసివేసి బాధితుడి ఖాజా మియాను అక్కడి నుండి పంపించినట్లు ఆయన ఆరోపించాడు. అనంతరం అక్కడి నుండి తన ద్విచక్ర వాహనంపై ఖాజా మియా పెద్దేముల్ చౌరస్తాకు చేరుకోగానే అతని వాహనం కూడా ఒక్కసారిగా నిలిచిపోయి అక్కడే ఆగిపోయింది. దీంతో వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా, ట్యాంకులోని మొత్తం పెట్రోల్ ను ఓ రెండు లీటర్ల డబ్బాలో బయటకు తీసి పరిశీలించిన మెకానిక్ అందులో ఉన్న పెట్రోల్ లో నీరు కలిసినట్లు గుర్తించినట్లు బాధితుడు తెలిపాడు.తర్వాత ఆ రెండు లీటర్ల డబ్బాలో తీసిన ఆ పెట్రోల్ ను ఖాజామియా శుక్రవారం అప్పటికే పెద్దేముల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామసభకు తీసుకువచ్చి గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, ఉపసర్పంచ్ డివై. ప్రసాద్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులకు చూపించి విషయాన్ని గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చాడు.ఈ విషయంపై స్పందించిన గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు వెంటనే పెద్దేముల్ తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనను పూర్తిగా వివరించారు. పెట్రోల్‌లో నీరు కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పూర్తి స్థాయి విచారణ చేపట్టి, అవసరమైతే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు స్పందించిన తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ సంబంధిత పెట్రోల్ బంక్ యజమానిని పిలిచి మాట్లాడి పెట్రోల్ విక్రయాలు నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని, బాధితులను తన వద్దకు పంపించాలని తెలిపారని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై. నర్సింహులు అన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విఘ్నేశ్వర పెట్రోల్ పంప్ యజమాని కోహిర్ రవిశంకర్ వివరణ

మా పెట్రోల్ పంపులో పెట్రోల్ లో నీళ్లు ఎక్కడ కూడా ఏమి రాలేదు.ఈ మధ్య పెట్రోల్ లో ఇథనాల్ మిక్స్ అయి వస్తుంది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పెద్దేముల్ గ్రామానికి చెందిన ఖాజామియా కు డబ్బా లో పెట్రోల్ లో నీళ్లు వచ్చాయని తెలిసింది! ఈ విషయమై మేము కూడా మా కంపెనీకి ఫిర్యాదు చేశాము. ప్రస్తుతం పెట్రోల్ లో ఈథనాల్ మిక్స్ అయి వస్తుంది. పెట్రోల్ పంపులో ఓక రాడ్ కూడా పోయిందని, ఆ రాడ్ నీ సరి చేసే వరకు ప్రస్తుతం శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి మా పెట్రోల్ పంపు లో పెట్రోల్ అమ్మకాలు కూడా పూర్తిగా నిలిపి వేశామని అన్నారు. పెట్రోల్ పంపు లో ఉన్న రాడ్ రిపేర్ అయ్యాక మళ్ళీ పెట్రోల్ అమ్మకాలు ప్రారంభిస్తామని తన వివరణలో తెలిపారు.