prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:43 pm Digital Edition : PRAJA KSHETRAM

వినాయక మండపాలపై ఆంక్షలేంటి..?

వినాయక మండపాలపై ఆంక్షలేంటి..?

  • నిబంధనల పేరుతో అనుమతుల నిరాకరణ
  • గణపతి ఉత్సవాల నిర్వహణలో పోలీసుల వివక్ష
  • శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం
  • పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌ ఫైర్
  • సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్

కరీంనగర్, జూలై 17(ప్రజాక్షేత్రం):గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించారని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆయన అక్కడ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఒకప్పుడు తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేదని, ప్రస్తుతం కరీంనగర్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. దాదాపు 38 ఏళ్లుగా గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఇప్పుడు మండపాలు ఏర్పాటు చేయొద్దని చెప్పడం సమంజసం కాదన్నారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదని విమర్శించారు. దేవుడి విగ్రహాల రక్షణలో విఫలం బొమ్మకల్‌లో హనుమాన్ విగ్రహం చోరీ ఘటనను ప్రస్తావిస్తూ, దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు విగ్రహాన్ని వెతికి ప్రతిష్ఠించిన తనపై, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడం విచారకరమన్నారు. దేవుడి విగ్రహాలను కాపాడాల్సిన పరిస్థితి రావడం పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, పోలీస్ స్టేషన్‌కు పిలిపించి గౌరవంగా పంపించడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. కరీంనగర్‌లో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత పోలీస్ కమిషనర్‌పై ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కరీంనగర్ పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలని, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.