prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 7:08 pm Digital Edition : PRAJA KSHETRAM

‘వెనిజులా విప్లవ వేగుచుక్క’హ్యూగో చావెజ్

‘వెనిజులా విప్లవ వేగుచుక్క’
హ్యూగో చావెజ్ లాటిన్ అమెరికాలో సైమన్ బొలివర్, ఫెడల్ కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు హ్యూగో చావెజ్. ఆయన అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ప్రతిఘటించి విప్లవ చోదక శక్తిగా ప్రభవించి ప్రత్యామ్నాయ సారధిగా పరిణమించి వెనిజులాలో నయా వలసవాద రాజకీయాలను అంతమొందించి ప్రపంచానికి ప్రత్యామ్నాయ మార్గదర్శనం చేశారు. సైనిక తిరుగుబాటుతో వెలుగులోకి ప్రసరించిననూ క్రమంగా ఆయన ప్రజాస్వామిక పంథాని అనుసరించి వెనిజులాలో సోషలిస్టు పాలనకు మార్గాన్ని సుగమం చేసి సరికొత్త చరిత్రను సృష్టించారు.

సామాన్య మధ్య తరగతి ఉపాధ్యాయ కుటుంబంలో ఇలెనా ప్రియాస్ డి చావెజ్, హ్యూగో డి లాస్ రేయాస్ చావెజ్ అనే దంపతులకు 1954, జూలై 28 నాడు హ్యూగో చావెజ్ జన్మించారు. ఆయన సైనిక అకాడెమీలో చేరి 1975 లో పట్టభద్రులయ్యారు. ఆయన గెరిల్లా నిరోధక కార్యకలాపాల నిమిత్తం నియమింపబడి చురుకైన పాత్రను నిర్వహించడమే కాకుండా అధ్యాపకులుగా విధులు నిర్వర్తించి కొత్త తరం సైనికులను, అధికారులను తీర్చిదిద్దారు. పేద వర్గాల నుంచి వచ్చిన సైనికాధికారుల ప్రజాస్వామిక ఆశయాలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా 1987′ డిసెంబర్ 17 న ‘బోలివర్ విప్లవోద్యమం-200’ ని ఆవిర్భవింపజేయడంలో చావెజ్ విశేష కృషి చేశారు. హ్యూగో చావెజ్ బృంద సభ్యులు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణకు పిడికిలి బిగించారు. సైన్యంలో కేవలం పది శాతం మద్దతు కలిగి ఉన్న చావెజ్ వారి సహాయంతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 1992 డిసెంబర్ లో సైనిక తిరుగుబాటు చేయాలనుకున్న చావెజ్ పథకం విఫలమైననూ ఆయన ప్రజల్లో పెద్ద కదలిక తీసుకువచ్చారు. సైనిక తిరుగుబాటులో పాల్గొన్న అనేక మంది అధికారులు మరియు సైనికులు చెరసాలపాలు అయ్యారు. చెరసాలలో ఉండగానే చావెజ్ తీక్షణమైన అధ్యయనం చేసి 'విప్లవాన్ని సమర్ధిస్తూ ముందుకు వచ్చిన వారంతా ఆకలితో ఉన్నవారేనని, విప్లవక్రమం సాధించకుండా వెనిజులా ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడదు' అని చావెజ్ గ్రహించి విప్లవక్రమం లక్ష్యాలను సాధించడానికి సైన్యాన్ని ఒక వాహకంగా ఎంచుకున్నారు. చావెజ్ నిర్బంధం నుండి విడులయ్యాక సైన్యం వెలుపల కూడా ఉద్యమాన్ని బలోపేతం చేశాడు. ప్రజాస్వామిక కార్యాచరణ (ఎ. డి) పార్టీ మరియు ప్రజాస్వామిక రాజకీయ ఎన్నికల సంఘటనా మండలి ( కోపి) పార్టీలు విశ్వసనీయతను కోల్పోవుతున్న నేపథ్యంలో 'ఎన్నికల పంథా'ను ఎంచుకోవడం మేలు అని ఉద్యమ నాయకత్వం భావించింది. చావెజ్ తో పాటు ఇతర విప్లవ ఉద్యమ నాయకులు దేశమంతా పర్యటించి ఆయా సముదాయాలతో చర్చలు జరిపి 'రిపబ్లిక్ ఉద్యమాన్ని' స్థాపించి దానికి రాజకీయ వేదికను కల్పించారు. 1997, ఏప్రిల్ 19 న జరిగిన బొలివేరియన్-200 మహాసభల సందర్భంగా పార్లమెంట్ రాజకీయాల్లో పాల్గొనాలన్న నిర్ణయాన్ని చావెజ్ బృంద సభ్యులు తీసుకున్నారు. తదుపరి 1998 డిసెంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ 56 శాతం ఓట్లు తెచ్చుకొని అధ్యక్షుడుగా విజయం సాధించి వెనిజులాలో సరికొత్త చరిత్రను సృష్టించారు. సైన్యాన్ని వాహకంగా చేసుకొని అధ్యక్షుడుగా విజయం సాధించిన చావెజ్ పేదలకు గృహవసతి కల్పించడం, వైద్యం, పౌష్టికాహారం తదితర సేవలను అందించడం లాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు సైన్యాన్ని సమీకరింపజేశారు. విద్య, వైద్యం, ఉపాధి, గృహావసతి, మరియు ఆహార వసతి లను ప్రజలందరికీ మౌలిక హక్కులుగా రాజ్యాంగంలో పొందుపరిచారు. మళ్ళీ 2000 జూలై నెలలో జరిగిన ఎన్నికల్లో చావెజ్ అనుకూల శక్తులు విజయం సాధించడంతో చావెజ్ తిరిగి రెండవసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆయన 2001 నవంబర్ లో ప్రజోపయోగ భూసంస్కరణలు, చమురు వనరుల స్వాధీనం, సూక్ష్మ వనరుల స్వాధీనం తదితర కీలకాంశాల ఉత్తర్వులను పార్లమెంట్ లో నెగ్గించుకున్నారు. యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్యావకాశాలు కల్పింపజేశారు. ఆయన ప్రధాన పదవులు అన్నింటిలోనూ విప్లవ చైతన్యం గల అధికారులను నియమించి చమురు, బంగారు గనులు మొదలైన ప్రకృతిపరమైన సహజ వనరులను అన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి జాతికి అంకితం చేశారు. చావెజ్ ను 2002, ఏప్రిల్ 11 న సైనికావాసాల నడుమ టియునా కోటలో 20 మందితో కూడిన సైనిక ముఠా నిర్బంధిననూ కొందరు అధికారుల చొరవ, ప్రజాబలం అయిననూ సురక్షితంగా రక్షించగలిగింది. 2002, ఏప్రిల్ 11 సైనిక ముఠా తిరుగుబాటుతో అన్యాయంగా గద్దెదింపబడిన చావెజ్ కేవలం 48 గంటల్లోనే తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటనగా నిలిచింది. 2005 లో చావెజ్ మొదటిసారిగా '21 వ శతాబ్ధి సోషలిజం' అన్ని నినదించిననూ తాను 'మార్క్సిస్ట్' అని, 'కమ్యూనిస్ట్' అని చెప్పుకోలేదు.ఆయనపై సైమన్ బొలివర్ ప్రభావం అత్యధికంగా ఉండడంతో తానొక 'బొలివేరియన్' నని, ఒక 'విప్లవకారుడు' నని మాత్రమే ఆయన ప్రస్తావించుకున్నారు. వెనిజులా దేశ సౌభాగ్యం కోసం 'బొలివేరియన్ మార్గం' సరిపోతుందని ఆయన విశ్వసించారు. 2006 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చావెజ్ 63 శాతం ఓట్లు తెచ్చుకొని తిరిగి మూడవసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే వామపక్ష శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి 'యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా' ని చావెజ్ స్థాపించారు. అలాగే మరోసారి 2012 లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రలు, మీడియా విష ప్రచారాలు అన్నింటిని చావెజ్ అవలీలగా అధిగమించి 53 శాతం ఓట్లు సాధించి తిరిగి నాల్గవసారి అధ్యక్షుడుగా ఎన్నిక కాబడి విజయఢంకా మ్రోగించారు. చావెజ్ నాలుగు పర్యాయాలు అధ్యక్షుడుగా కొనసాగిననూ ఆయన తననెప్పుడు అధ్యక్షుడుగా భావించుకోలేదు. ఆయన అతి నిరాడంబర జీవితాన్ని గడిపారు. చావెజ్ వెనిజులా స్థితిగతులను సునిశితంగా అధ్యయనం చేసి సరైన విప్లవ క్రమాన్ని అనుసరించడంలో కృతకృత్యులై విజయాన్ని సాధించారు. వెనిజులా విప్లవ పోరాటంలో చావెజ్ క్రియాశీల పాత్రని నిర్వహించారు. ప్రపంచీకరణ విధానాలకు ప్రత్యామ్నాయ బాటను చూపి ఆచరించి తన పద్నాలుగు ఏళ్ల పాలనను జనరంజకంగా తీర్చిదిద్దిన 'బొలివేరియన్ సోషలిస్ట్' గా చావెజ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వెనిజులాలో అమెరికన్ వలసవాద ఆధిపత్యాన్ని అంతమొందించి పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రత్యామ్నాయ నేతగా ప్రజా హృదయాలను గెలుచుకున్న హ్యూగో చావెజ్ ని కాన్సర్ వ్యాధి కబళించడంతో 2013, మార్చి 5 న తుదిశ్వాస విడిచారు. నేడు చావెజ్ లేని వెనిజులా, చావెజ్ లేని లాటిన్ అమెరికా, చావెజ్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం ఎంత మాత్రం సాధ్యం కాదు. చావెజ్ మరణించిననూ, తరాలు అంతరించిననూ ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజా హృదయాలలో మెడలాడుతూనే ఉంటాయి. ఆఖరి క్షణం వరకు జనహితం కోసం కృషి చేసిన చావెజ్ ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఆదర్శ నేతగా కీర్తి పతాకాలు అందుకొని జయకేతనంతో ప్రభవించారు. హ్యూగో చావెజ్ కాన్సర్ వ్యాధితో కనుమూసిననూ ఆయన నేడు ప్రజా హృదయాలలో చిరస్మరణీయంగా 'వెనిజులా విప్లవ వేగుచుక్క'గా వెలుగొందుతూనే ఉన్నారు.

(జూలై 28 హ్యూగో చావెజ్
72 వ జయంతి)

జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ స్కాలర్
సెల్: 94933 19690.