prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 3:42 am Digital Edition : PRAJA KSHETRAM

వనపర్తి అభివృద్ధికి ఐటీ ఊతం

వనపర్తి అభివృద్ధికి ఐటీ ఊతం

  • రూ.22 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి భూమి పూజ ..
  • స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడి

వనపర్తి, జూలై 01(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. జిల్లా కేంద్రంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఐటీ టవర్‌కు బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. జిల్లాను సమాచార సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ఐటీ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ టవర్ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఇతర నగరాలు లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, స్వస్థలంలోనే ఉపాధి పొందే అవకాశం కలుగుతుందన్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు వనపర్తిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఈ టవర్ వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఐటీ టవర్ ద్వారా డిజిటల్ సేవలు మరింత విస్తరించడంతో పాటు జిల్లాకు కొత్త పెట్టుబడులు ఆకర్షితమవుతాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఐటీ టవర్ నిర్మాణానికి రూ.22 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా నాయకులు బ్రహ్మచారి, బి. కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.