prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 4:36 am Digital Edition : PRAJA KSHETRAM

కేటీఆర్ విజ్ఞప్తితోనే సర్ గడువు పొడిగింపు

కేటీఆర్ విజ్ఞప్తితోనే సర్ గడువు పొడిగింపు

  • పెద్దేముల్‌లో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియపై సమీక్ష
  • పెద్దేముల్ తహసీల్దార్‌తో భేటీ అయిన శ్రీశైల్ రెడ్డి
  • ప్రతి అర్హతల ఓటరుకి న్యాయం జరగాలి
  • బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి

పెద్దేముల్, జూలై 17 (ప్రజాక్షేత్రం):కేటీఆర్ విజ్ఞప్తితోనే రాష్ట్రంలో సర్ గడువు పొడగించడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జి పంజుగుల శ్రీశైల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, సంబంధిత సిబ్బందితో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఎన్యుమరేషన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఫారం-6, ఫారం-7, ఫారం-8ల వినియోగం, వాటి ప్రాధాన్యతపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బోగస్ ఓట్లు, మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన, స్వీకరించిన దరఖాస్తుల వివరాలతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కూడా ఆరా తీశారు.ఎన్యుమరేషన్ ప్రక్రియలో వివాహిత మహిళల ఓటు నమోదు, పేర్లు, చిరునామా మార్పులకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను అధికారులు శ్రీశైల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పెద్దేముల్ తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ సుమారు 71% శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, బోగస్ ఓట్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి SIR ప్రక్రియ గడువు పొడిగించాలని కోరగా, ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు గడువు పొడిగించడం సంతోషకరమని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“ప్రతి అర్హత కలిగిన ఓటు ప్రజాస్వామ్యానికి బలం. ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా మిస్ కాకూడదు. బోగస్ ఓటుకు ఎలాంటి తావు ఉండకూడదు” అని శ్రీశైల్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు రమేష్, మాజీ సర్పంచ్ పి.జనార్దన్ రెడ్డి,వెంకటేష్ చారి,గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు డివై ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి రంగయ్య,గ్రామ ప్రధాన కార్యదర్శి మామిళ్ళ వెంకట్, సీనియర్ నాయకులు మంబాపురం యాదయ్య,మహమ్మద్ శిబ్లీ, చందర్ నాయక్, బ్యాగరి శ్రీనివాస్,పురుషప్ప, చెట్లమీది రాంచెంద్రి తో పాటు పలువురు కార్యకర్తలు,బీఎల్ఓ, బీఎల్ఏ లు, తదితరులు పాల్గొన్నారు.