prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 1:40 am Digital Edition : PRAJA KSHETRAM

ఆర్టీసీ బస్సులో సీటు కోసం వేసిన హ్యాండ్ బ్యాగ్ మాయం..!

ఆర్టీసీ బస్సులో సీటు కోసం వేసిన హ్యాండ్ బ్యాగ్ మాయం..!

– బ్యాగులో ఒకటిన్నర తులాల బంగారం, సెల్ ఫోన్,నగదు ఉండడంతో మహిళ ఉక్కిరిబిక్కిరి

– రెండు గంటలలో హ్యాండ్ బ్యాగ్ వెతికిచ్చిన కోటగిరి పోలీసులు

– ఎస్సై శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపిన బాధితులు

– పోతంగల్ మండల కేంద్రంలో ఘటన

కోటగిరి,జులై 31( ప్రజాక్షేత్రం):కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ బస్సులో మహిళ హ్యాండ్ బ్యాగ్ మాయమైన ఘటన, ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకునేందుకు పోలీసులు చూపిన చొరవ ప్రత్యేకతను సంతరించుకుంది. బ్యాగు మిస్సయిన రెండు గంటల్లో బ్యాక్ ఎక్కడుందో ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టి బాధితులకు బ్యాగ్ అప్పజెప్పి కోటగిరి పోలీసులు పనితీరులో ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే పోతంగల్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ పోతంగల్ బస్టాండ్ లో బస్సు ఎక్కేందుకు వేచి ఉండగా ఓ బస్సు వచ్చి ఆగడంతో ఆ బస్సులో సీటు పట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను సీటులో వేసింది. బస్సులోంచి అందరూ దిగిపోయాక ఆమె ఎక్కి సీటు వద్ద గమనించగా తన హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన మహిళ అక్కడ ఉన్నవారికి సమాచారం ఇచ్చి వెంటనే కుటుంబ సభ్యులకు విషయం చెప్పి కోటగిరి ఎస్సై శ్రీనివాస్ ను సంప్రదించి బ్యాగులో ఒకటిన్నర తులాల బంగారం, నగదు, సెల్ఫోన్ ఉన్నట్లు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్సై శ్రీనివాస్ బ్యాగులో ఆమె మర్చిపోయిన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి ఆ బ్యాగు హంగార్గా ఫారం గ్రామానికి వెళ్లినట్లు గుర్తించి బాధిత మహిళ కుటుంబీకులతో పోలీసు సిబ్బందిని పంపి బ్యాగును రికవరీ చేయించి ఆ మహిళకు అందజేశారు. ఈ తంతు అంతా కేవలం రెండు గంటలలో ముగియడంతో పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బ్యాగులో బంగారం నగదు సెల్ఫోన్ ఉండడంతో బ్యాగు మాయం అవ్వగానే తీవ్ర దుఃఖానికి లోనైన బాధిత మహిళ పోలీసులు బ్యాగు వెతికి పట్టించి ఇవ్వగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందని పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. హ్యాండ్ బ్యాగ్ మిస్సింగ్ వ్యవహారంలో వెంటనే స్పందించి కోటగిరి పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని విలువైన వస్తువులు ఉన్న బ్యాగులను సీటు కోసం వేయవద్దని కోటగిరి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.