ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో మంబాపూర్‌లో అభివృద్ధి పరుగులు
- రెండున్నరేళ్లలో రూ.1.15 కోట్లతో మంబాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు
- రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం
- 328 ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
- విద్యా మౌలిక వసతులకు రూ.21 లక్షల నిధులు
పెద్దేముల్, ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పీటర్ యాదయ్య, ఉపాధ్యక్షులు జి.రాములు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో దశలవారీగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం మంబాపూర్ గ్రామంలో ఇదివరకు గ్రామంలో జరిగిన వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలపై విలేఖరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పలు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.1.15 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
రోడ్లు, డ్రైనేజీకి భారీగా నిధులు
మాంబాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు.6వ, 7వ వార్డుల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ.10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. గోపాలకృష్ణ దేవాలయం సమీపంలో మరో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.అదేవిధంగా 5, 6వ వార్డుల్లో రూ.20 లక్షలు, 1, 2వ వార్డుల్లో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 3వ వార్డులో డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.4 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
9వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.1 లక్షతో కొత్త బోర్ మోటారులు ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
పంచాయతీ, డ్వాక్రా భవనాలకు నిధులు
గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.డ్వాక్రా మహిళల కోసం నూతన భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు అవసరమైన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
విద్యకు ప్రాధాన్యం
మంబాపూర్ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. TGEWIDC నిధుల నుంచి సుమారు రూ.21 లక్షలతో నూతన సైన్స్ రూమ్ ను మంజూరు చేసినట్లు చెప్పారు.పాఠశాల రక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
328 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంబాపూర్ గ్రామానికి తొలి విడతలోనే 328 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ఎమ్మెల్యేకు గ్రామ అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని యాదయ్య తెలిపారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మంబాపూర్‌కు మొదటి ప్రాధాన్యత లభించిందని అన్నారు.అదేవిధంగా గ్రామంలోని అర్హులైన పేదలకు 150 నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు.ఆత్మీయ భరోసా పథకం కింద 84 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
మంబాపూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారని, వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసని అన్నారు.బీఆర్‌ఎస్ నాయకులను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, గతంలో జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు.మంబాపూర్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో మరింత అభివృద్ధి
మంబాపూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారం కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.రాబోయే రోజుల్లో కూడా గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, విద్య, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర రంగాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు యాదయ్య, ఉపాధ్యక్షులు రాములు,ఖలీల్, మాజీ సర్పంచులు నారాయణ, శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు శ్రీనివాస్, ఇబ్రహీం, మంగలి పాండు, అంజి, ఏసు, విజయ్ కుమార్, చెన్నారం శ్యామ్, కుమ్మరి నర్సింహులు, తెర్వటీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.