prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 3:04 pm Digital Edition : PRAJA KSHETRAM

కందనెల్లి తండా సర్పంచ్‌పై గ్రామస్తుల ఫిర్యాదు

కందనెల్లి తండా సర్పంచ్‌పై గ్రామస్తుల ఫిర్యాదు

  • వీధి దీపాలు, తాగునీరు, బోర్ మోటార్ల సమస్యలు పరిష్కరించాలని కోరితే బెదిరింపులు
  • సర్పంచ్, ఆయన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డీపీఓకు వినతి
  • గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారని ఆరోపణ

పెద్దేముల్, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి తండా గ్రామ సర్పంచ్ ఆనంద్ నాయక్‌పై గ్రామస్తులు సోమవారం పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చిన వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి జయసుధకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు తమతో దురుసుగా వ్యవహరిస్తూ, దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదులో ఆరోపించారు.ఈ సందర్భంగా పలువురు కందనెల్లి తండా గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారి జయసుధకు తమ గోడును వెళ్ళబోసుకుంటూ.. కందనెల్లి తండా గ్రామంలో వీధి దీపాలు, తాగునీటి సమస్య, బోర్ మోటార్ల మరమ్మతులు తదితర సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఆయా సమస్యలను సర్పంచ్ ఆనంద్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరితే తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతు మాటలు తిడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సెక్రటరీపై కూడా దుర్భాషలాడారని ఆరోపణ

గ్రామ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శి కే. నవితను తాము కలిసి సమస్యలను వివరించే సమయంలో సర్పంచ్ కుమారుడు అక్కడికి వచ్చి గ్రామస్తులతో కార్యదర్శి కే.నవితను మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తూ, ఆమెను అందరి సమక్షంలో దుర్భాషలాడినట్లు గ్రామస్తులు ఆరోపించారు.ఈ ఘటనతో పంచాయతీ కార్యదర్శి కే.నవిత అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

గ్రామంలో ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాలని గ్రామస్తులు కోరారు.ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే హక్కును అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.కందనెల్లి తండా గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, సర్పంచ్ ఆనంద్ నాయక్, ఆయన కుమారుడిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీపీఓ జయసుధను గ్రామస్తులు వినతిపత్రంలో కోరారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కందనెల్లి తండా గ్రామ నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.