prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 3:19 pm Digital Edition : PRAJA KSHETRAM

క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు హెచ్ఎం కే.జోజప్ప

క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు హెచ్ఎం కే.జోజప్ప

  • అంకితభావంతో ఆదర్శంగా నిలిచిన కే.జోజప్ప
  • తట్టేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని 14 పాఠశాలల సమన్వయంలో సమర్థవంతమైన సేవలు
  • విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేశారు
  • కే.జోజప్పకు ఘనంగా వీడ్కోలు.. ఘన సన్మానం
  • స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా ఘన సన్మానం

పెద్దేముల్, ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత, సమయపాలనకు తట్టేపల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం కోయ జోజప్ప మారుపేరుగా నిలిచారని పెద్దేముల్ మండల ఎంఈఓ పి.నర్సింగ్‌రావు అన్నారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కవిత అధ్యక్షతన తట్టేపల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం కే.జోజప్ప స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ పి.నర్సింగ్‌రావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. కోయ జోజప్ప తట్టేపల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా, అనంతరం తట్టేపల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎంగా సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన వంటి అంశాల్లో నిక్కచ్చిగా ఉంటూ, అంకితభావంతో పనిచేసి ఇతర నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.
ఇంకా సుమారు 3 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ కుటుంబ కారణాల వల్ల స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నారని తెలిపారు. పెద్దేముల్ మండలంలోని కాంప్లెక్స్ హెచ్‌ఎంలలో సానుకూల దృక్పథంతో ఆలోచించే వ్యక్తిగా కే.జోజప్పకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.తట్టేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని 14 పాఠశాలలను సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. ‘పని చేయమని చెప్పేవాడే ఉపాధ్యాయుడు కాదని తానే ముందుండి పనిచేసేవాడే నిజమైన ఉపాధ్యాయుడని’ కే.జోజప్ప నిరూపించారని అన్నారు.తన ఉద్యోగ జీవితంలో ఎంతోమంది విద్యార్థులను, శిష్యులను మంచి మార్గంలో నడిపించి, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా తట్టేపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం కే.జోజప్ప మాట్లాడుతూ …. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ధర్మన్నగూడలో తొలిసారిగా నవంబర్ 13, 2000వ సంవత్సరంలో ఎస్జిటిగా ఉద్యోగంలో చేరడం జరిగిందని అన్నారు.అనంతరం 2002లో పూడూరులో హెచ్‌ఎంగా పనిచేశానని చెప్పారు. తదుపరి నాదర్ గుల్ జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదిన్నరెండ్లుగా స్కూల్ అసిస్టెంట్‌గా, అనంతరం చిలకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహించినట్లు వివరించారు. 2024 జూన్ 13న సాధారణ బదిలీల్లో భాగంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న పెద్దేముల్ మండలం తట్టేపల్లి ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చానని తెలిపారు. తనకు జీవితంలో అడవిలో, ప్రకృతికి దగ్గరగా కొన్ని రోజులు జీవించాలనే కోరిక ఉండేదని, తట్టేపల్లి పాఠశాలలో చేరిన తర్వాత ప్రకృతి మధ్యలో విధులు నిర్వహించే అవకాశం రావడంతో తనకు ఆ కోరిక నెరవేరిందన్నారు.తట్టేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు,పెద్దేముల్ మండలంలో విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తనకు అన్ని విధాలుగా సహకరించారని, తాను ఏ పని చెప్పినా ఎవరూ కాదనలేదని అన్నారు. 13 మంది ఉపాధ్యాయులతో పాటు 14 పాఠశాలలతో కూడిన తట్టేపల్లి కాంప్లెక్స్‌ను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో అందరి సహకారం ఎంతో ఉందని తెలిపారు.తట్టేపల్లి ఉన్నత పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారని,ఆ విద్యార్థుల భవిష్యత్తే ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల అసలు బాధ్యత అని అన్నారు.విద్యార్థుల అభివృద్ధిని తమ భవిష్యత్తుగా భావించి ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తట్టేపల్లి గ్రామస్తులు పాఠశాలకు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే.. జీవితమే ఉద్యోగం కాదు” అని జోజప్ప అన్నారు.తాను సుమారు తొమ్మిదేళ్లు ప్రైవేట్ పాఠశాలల్లో, 26 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశానని తెలిపారు.ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల మరో రంగంలో పనిచేయాలని నిర్ణయించుకున్నందున స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ప్రస్తుతం విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తు మన భవిష్యత్తుగా భావించి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. తన జీవితంలో ఇంత గొప్పగా విజయాలు సాధించడానికి తన కుటుంబ సభ్యుల, స్నేహితుల, ఎక్కడ పని చేసిన కూడా అక్కడ సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి, సిబ్బందికి, పెద్దేముల్ మండలం లో ఉన్న ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కోయ జోజప్ప ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా సన్మానం

అనంతరం తట్టేపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం జోజప్పను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించింది. పీఆర్టీయూ, తపస్, టీఎస్‌యూటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సంఘ నాయకులు కూడా జోజప్పను సత్కరించారు.తట్టేపల్లి గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, కాంప్లెక్స్ పరిధిలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జోజప్పను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తట్టేపల్లి గ్రామ సర్పంచ్ నారాయణ గౌడ్, పాఠశాల ఏఏపీసీ చైర్మన్ జాదవ్ సీతాబాయి,పెద్దేముల్ మండల ఎంఈఓ నర్సింగ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, తట్టేపల్లి ఉన్నత పాఠశాల సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కవిత, ఆయా కాంప్లెక్స్ ల హెచ్ఎంలు శివకుమార్, సునీత, పీఆర్టీయూ పెద్దేముల్ మండల అధ్యక్షురాలు ఎం.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గోబ్ర్యా నాయక్, తపస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గాజుల బస్వరాజ్, మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, కార్యదర్శి అనిల్ కుమార్, టీఎస్ యూటిఎఫ్ మండల అధ్యక్షుడు పాండురంగం, బండమీదిపల్లి,అడికిచర్ల ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు శంకర్,వీరేశం, తట్టేపల్లి గ్రామ పెద్దలు కే.గోపాల్, జగన్, శంకర్ నాయక్, తట్టేపల్లి కే. నర్సింహులు, డీలర్ అంజయ్య, కిష్టప్ప, అంజప్ప, తట్టెపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్ భాగ్యలక్ష్మి, నరేష్,విజయ్ కుమార్,పాండరప్ప ప్రభాకర్ , భీమయ్య,సుజాత,జగదాంబ,మంజుల రాజు, పీఈటీ ప్రమోద్ కుమార్, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు,కే.జోజప్ప ఆత్మీయ మిత్రబృందం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.