జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిపేరు గొప్పే వైద్యం ఎక్కడ?
- సర్ది, తలనొప్పికే పరిమితమైన వైద్యం.
- డాక్టర్లు లేక రోగుల అవస్థలు.
- డిప్యూటేషన్‌లతో ఖాళీ అవుతున్న ఆస్పత్రి.
- ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్న పేదలు.
జహీరాబాద్ ఆగష్టు 20(ప్రజాక్షేత్రం):పట్టణానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఏరియా ఆస్పత్రి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందా? పేరు మాత్రం ఏరియా ఆస్పత్రి.. కానీ సరైన వైద్యులు లేక ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి నమ్మకంతో వచ్చే పేద రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు లేకపోవడం.. ఉన్న కొందరు డిప్యూటేషన్‌పై వెళ్లడం.. అవసరమైన మందులు, వైద్య సేవల కోసం బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు.
పేరు పెద్దది.. సేవలు మాత్రం చిన్నవేనా?
ఒకప్పుడు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి వైద్య సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. అదే ఆస్పత్రి నేడు సరైన వైద్యులు లేక వెలవెలబోతుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
“ఆస్పత్రికి పోదామంటే భయం.. వెళ్తే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు.. మందులు ఉంటాయో లేదో తెలియదు” అంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం చివరకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి రావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్యం పొందాల్సిన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గుమ్మం తొక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు.
ప్రజల ప్రశ్న ఒక్కటే.. డాక్టర్లు ఎక్కడ?
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, డిప్యూటేషన్‌పై ఉన్న వైద్యులను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి అంటే పేదల ప్రాణాలకు భరోసా కావాలి.. ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించే కేంద్రంగా మారకూడదు.
ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వం, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణ చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ప్రజలు కోరుతున్నారు.