దళితులకు రక్షణేది.?
- ఎఫ్ ఐ ఆర్ దశలోనే నిలిచిన అట్రాసిటీ కేసులు.
- అట్రాసిటీ కేసుల్లో పరిహారం ఏది.?
- అధికారుల నిర్లక్షంతోనే ఆరు హత్యలు.
- అయినా మారని పోలీసు అధికారుల తీరు.
- అట్రాసిటీ కేసుల్లో 5 నెలలు గడిచిన దర్యాప్తు లేదు.
- అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ ఎక్కడ.?
చేవెళ్ల, ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):పోలీసుఅధికారుల నిర్లక్షంతో అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ దశలోనే ఆగిపోతున్నాయి. గడువులోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం వల్ల నిందితులకు కోర్టుల్లో ప్రయోజనం కలుగుతోంది. నెలలు గడుస్తున్న విచారణ చేపట్టకపోవటం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, నిస్సహాయత కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం షాబాద్ ఆరు హత్యల ఘటన పోలీసుల నిర్లక్ష్యంతోనె అంటూ ప్రజలు తీవ్ర ఆరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. దళిత జర్నలిస్టుపై దాడి షాబాద్ ఘటనలో అధికారుల తీరు ఇదే తరహాలో కనిపిస్తుంది. నిందితులపై నమోదైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులో 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికి పోలీసులు విచారణ చేపట్టలేదు. కేసులలో అధికారుల వైఫల్యం వల్ల బాధితులకు తక్షణ న్యాయం జరగటం లేదు.
అధికారుల బాధ్యతారాహిత్యం కమిషన్‌ల ఆగ్రహం
ఎస్సి, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంపై తరచూ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్‌లు న్యాయస్థానాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసులలో అధికారుల వైఫల్యం వల్ల బాధితులకు తక్షణ న్యాయం జరగటం లేదని కమిషన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఇంకా కొందరు అధికారుల తీరు మారడంలేదు.
గడువులోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం వల్ల నిందితులకు కోర్టుల్లో ప్రయోజనం కలుగుతోంది.
చట్టం ప్రకారం విధి నిర్వహణలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి పాల్పడే ప్రభుత్వోద్యోగులపై సెక్షన్ 4 కింద చర్యలకు అవకాశం ఉంది. అట్రాసిటీ కేసుల దర్యాప్తులో జాప్యం వైఫల్యాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు పలు సందర్భాలలో ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా అధికారుల తీరు మారడంలేదు.
అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ ఎక్కడ?
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలవారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటుచేస్తూ అట్రాసిటీ కేసులు, చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కానీ ఈ కమిటీ ఇప్పటివరకు జిల్లాలో ఒక్కసారి కూడా అట్రాసిటీ కేసులపై మానిటరింగ్ నిర్వహించకపోవడం సర్కారు ఉదాసీనతకు అద్దం పడుతుంది. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.