prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 6:34 pm Digital Edition : PRAJA KSHETRAM

పోతంగల్ లో భారీగా గంజాయి పట్టివేత..?

పోతంగల్ లో భారీగా గంజాయి పట్టివేత..?

  • ఒడిశా రాష్ట్రం నుంచి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్దకు చేరిన గంజాయి..?
  • పోతంగల్ మంజీరా నది చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర వ్యక్తికి అప్పగించేందుకు ప్రయత్నం..?
  • 10కిలోలకుపైగా గంజాయి స్వాధీనం..?
  • పోలీసుల అదుపులో గంజాయి తరలిస్తున్న వ్యక్తులు..?

కోటగిరి, ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకుని గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుండి కామారెడ్డి జిల్లా కు చెందిన ఓ వ్యక్తి వద్దకు భారీగా గంజాయి చేరగా ఆ వ్యక్తి ఆ గంజాయిని పోతంగల్ మంజీరా నది వద్ద గల చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి అప్పజెప్పి మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం చేయడంతో అతనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన పోలీసులు పోతంగల్ మండల కేంద్రంలోని మంజీరా నది వద్ద అతనిని పట్టుకొని దాదాపు పది కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్న మరికొందరు వ్యక్తులను నేడో రేపో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలుస్తుంది. కాగా కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడడం స్థానికంగా సంచలనం సృష్టించింది. గతంలో కోటగిరికి చెందిన వ్యక్తి వద్ద ఐదు కిలోల గంజాయి పట్టుబడటం ప్రస్తుతం పోతంగల్లో అంతకు రెండింతలు గంజాయి పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గంజాయికి బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గంజాయి వ్యవహారంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించి సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. పోతంగల్ మంజీరా నదిపై ఉన్న చెక్ పోస్ట్ ను పోలీసులు ఎత్తివేయడంతోనే గంజాయి స్మగ్లర్లు ఇక్కడి నుండి విచ్చలవిడిగా సరుకు రవాణా చేస్తున్నారని పోతంగల్ మండల కేంద్రంలో చెక్పోస్ట్ ను ఏర్పాటు చేసి అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా గంజాయి పై వస్తున్న వార్త కథనాలపై సీరియస్ గా ఉన్న జిల్లా పోలీసు బాస్ ఆదేశానుసారం భారీ గంజాయి రాకెట్ ను స్థానిక పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తుంది. గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణాపై సీరియస్ గా ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగం గంజాయి తరలించే వారిపై ఉక్కు పాదం మోపుతుంది . ఈ విషయమై పోలీసులు అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ భారీ మొత్తంలో గంజాయి పట్టుబడడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయమై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.