prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:30 am Digital Edition : PRAJA KSHETRAM

పోలవరం ముంపు జాబితాలో సోంపల్లిని గుర్తించాలి

పోలవరం ముంపు జాబితాలో సోంపల్లిని గుర్తించాలి

  • కిన్నెరసాని బ్యాక్‌వాటర్‌తో ముంపు ప్రమాదం.. ఎం పి డి ఓ కు గ్రామస్తుల వినతి

బూర్గంపాడు, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంతో పాటు కిన్నెరసాని బ్యాక్‌వాటర్‌ కారణంగా సోంపల్లి గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని, అందువల్ల పోలవరం ముంపు ప్రాంతాల జాబితాలో సోంపల్లి గ్రామాన్ని కూడా గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోంపల్లి గ్రామస్తులు బూర్గంపాడు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎంపిడిఓ)జమలారెడ్డి కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొంటూ.. సోంపల్లి గ్రామం కిన్నెరసాని బ్యాక్‌వాటర్‌, ఇతర వాగులు, వరద ప్రభావానికి లోనయ్యే ప్రాంతంలో ఉందని తెలిపారు. బూర్గంపాడుకు కరకట్ట నిర్మాణం చేపట్టినప్పటికీ బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో తమ గ్రామంలోని భూములు, ఇళ్లకు ముంపు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే కిన్నెరసాని వరద ప్రభావంతో గ్రామంలోని పలువురు రైతుల భూములు కోతకు గురయ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భద్రాద్రి ప్రాంతంలో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున సోంపల్లి గ్రామంపై కూడా వరద, బ్యాక్‌వాటర్‌ ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.సోంపల్లి గ్రామాన్ని ముంపు ప్రాంతంగా పరిగణించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, చిన్న, సన్నకారు రైతులతో పాటు గ్రామస్థులకు న్యాయం చేయాలని కోరారు.గ్రామాన్ని పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపు నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎంపిడిఓ) జమలారెడ్డి ను గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.గ్రామ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపాలని వారు కోరారు.