
నాచారం, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):ఆర్భాటాలకు దూరంగా, ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సోమవారం నాచారం సర్కిల్ పరిధిలోని బాబానగర్, ఇంద్రనగర్ కాలనీల్లో కార్యకర్తలతో కలిసి బైక్‌పై పర్యటించారు. కాలనీల్లోని వీధులు, అంతర్గత రహదారులను పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాప్రతినిధులకు కనిపించే హడావుడి, భద్రతా ఏర్పాట్లకు భిన్నంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సాధారణ కార్యకర్తలా బైక్‌పైనే కాలనీల్లో తిరగడం స్థానికులను ఆకట్టుకుంది. దారిలో ఎదురైన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓపికగా విన్నారు. సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవడం లక్ష్మారెడ్డి పనితీరులో ప్రత్యేకతగా స్థానికులు పేర్కొంటున్నారు. కాలనీల అభివృద్ధి పనులపై నిరంతరం దృష్టి సారిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన చోట వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు.
ప్రజా సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపైనా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బీఎల్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు, ముఖ్యంగా మెడికల్ విద్యను అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఆయన పలుమార్లు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, నిరాడంబర జీవనశైలిని కొనసాగించడం వల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.