prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 4:05 am Digital Edition : PRAJA KSHETRAM

ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం:ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం:ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

  • గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • తోబుట్టువుగా అండగా ఉంటా..
  • నియోజకవర్గానికి పెద్దన్నగా పనిచేస్తా
  • రాఖీ కట్టిన మహిళలకు చీరల బహూకరణ
  • ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గిరిజనులతో ఆత్మీయంగా మమేకమైన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేని గిరిజన కుటుంబాలను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క పేద కుటుంబం సొంతింటికి దూరం కాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

ప్రతి తండాకు రహదారి..మౌలిక వసతులు

నియోజకవర్గంలోని ప్రతి తండాకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తామని మేఘారెడ్డి తెలిపారు. తండాల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలకు రాకపోకలు సులభతరం అయ్యేలా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సమర్థంగా వినియోగించి గిరిజన గ్రామపంచాయతీల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు.

సాగునీటికి ప్రాధాన్యం

గిరిజన రైతుల భూములకు సాగునీరు అందితేనే వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని తండాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కర్నే తండా ఎత్తిపోతల పథకానికి ‘శ్రీశ్రీశ్రీ సంత్‌ సేవాలాల్‌ ప్రాజెక్టు’గా నామకరణం చేయిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజనుల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానన్నారు. గిరిజన రైతుల భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతి తండాకు వైద్య సేవలు

గిరిజనులు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి తండాకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మేఘారెడ్డి అన్నారు. అవసరమైన చోట ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

సేవాలాల్‌ ఆలయాల నిర్మాణం

నియోజకవర్గంలోని 32 తండా గ్రామపంచాయతీల్లో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ ఆలయాల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం

గ్రామాల అభివృద్ధికి పనిచేసిన పాత, కొత్త సర్పంచుల పెండింగ్‌ బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మేఘారెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, పేదలు, యువత, గిరిజనులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. రైతు భరోసా, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గృహ విద్యుత్తు వినియోగదారులకు ఉచిత విద్యుత్తు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.

రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు

వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రహదారులు, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో పెద్దఎత్తున పనులు చేపడుతున్నామని చెప్పారు. ‘‘ప్రతి తండా అభివృద్ధి చెందాలి.. ప్రతి గిరిజన కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలి.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి.. ప్రతి రైతు భూమికి సాగునీరు అందాలి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం.. ఇదే నా సంకల్పం’’ అని మేఘారెడ్డి అన్నారు.

తోబుట్టువుగా అండగా ఉంటా

రాఖీ పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలు ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆత్మీయతను చాటుకున్నారు. రాఖీ కట్టిన ప్రతి మహిళను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి చీరలను బహూకరించారు. రాఖీ కేవలం దారం కాదని.. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, భరోసా, బాధ్యతలకు ప్రతీక అని మేఘారెడ్డి పేర్కొన్నారు. ‘‘మీరు నన్ను అన్నగా భావించి రాఖీ కట్టారు. ఇకపై మిమ్మల్ని నా తోబుట్టువులుగా భావిస్తూ ఎల్లవేళలా అండగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా సంకోచించకుండా నా దృష్టికి తీసుకురండి. సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా’’ అని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలోని ప్రతి మహిళకు తోబుట్టువుగా, పెద్దన్నగా అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కుటుంబసభ్యుడిగా మమేకమై వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి చెందే వరకు విశ్రమించబోనని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంగంపల్లి సర్పంచ్‌ రమేష్‌, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు వాల్యానాయక్‌, దిశా కమిటీ సభ్యుడు రవి నాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాజీ సర్పంచ్‌ రాధాకృష్ణ, అనకాపల్లి సర్పంచ్‌ ఆంజనేయులు నాయక్‌, కోతులకుంట తండా సర్పంచ్‌ పాండు నాయక్‌, వనపర్తి మాజీ ఎంపీపీ శంకర్‌ నాయక్‌, ఎంపీటీసీ నాగరాజు నాయక్‌తో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, గిరిజన పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.