prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 1:44 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రభుత్వ పాఠశాలలపై వచ్చిన కథనాలకు అధికారులు సీరియస్

ప్రభుత్వ పాఠశాలలపై వచ్చిన కథనాలకు అధికారులు సీరియస్

  • ప్రజా క్షేత్రం దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ
  • 11 ప్రభుత్వ పాఠశాలల సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ అధికారిగా ఎంపీడీఓ కే.తిరుమల స్వామి నియామకం
  • 11 పాఠశాలలను సందర్శించి వాస్తవ పరిస్థితులపై ఆరా
  • సమయపాలనలో నిర్లక్ష్యం వద్దు.. 9 నుంచి 4 వరకు విధుల్లో ఉండాల్సిందే
  • విచారణ వివరాలతో ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తాం
  • ప్రత్యేక విచారణ అధికారి,పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి

పెద్దేముల్, ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):తరగతులు నిర్వహించాల్సిన వేళ…పాఠశాలలకు తాళాలు అనే శీర్షికతో ప్రజాక్షేత్రం దినపత్రికలో ఈ నెల 28 నాడు శుక్రవారం రోజు ప్రచురించిన కథనానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి,జిల్లా జడ్పీ సీఈఓ సుధీర్ లు స్పందించారు. అందుకుగాను ఈ విషయమై పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామిని ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల సమగ్ర విచారణ అధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా నియమించబడ్డ పెద్దేముల్ ఎంపీడీఓ కే.తిరుమల స్వామి శనివారం మండల ఎంఈఓ పి.నర్సింగ్ రావుతో కలిసి పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న సుమారు 11 ప్రభుత్వ పాఠశాలలు రచ్చకట్ట తండా, జయరాం తండా, ఓమ్లానాయక్ తండా, బండమీది పల్లి, రాంసింగ్ తండా, పాషాపూర్, అడికిచర్ల ప్రాథమిక, అడికిచర్ల ఉన్నత పాఠశాలలు, ఊరేంటి తండా, బాయిమీది తండా, సిద్ధన్నమదుగు తండా ప్రాథమిక పాఠశాలలను శనివారం ప్రత్యేకంగా సందర్శించి లోతుగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల విద్యాబోధన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విచారణ అధికారి, పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి మాట్లాడుతూ….ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు వివిధ దినపత్రికల్లో తట్టేపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రజాక్షేత్రం దినపత్రికతో పాటు పలు దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలను పరిగణనలోకి తీసుకుని పెద్దేముల్ మండలంలోని 11 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించి, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల విధుల నిర్వహణ, సమయపాలన తదితర అంశాలపై వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలన తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండి తమ విధులను నిర్వర్తించాలని ఆదేశించినట్లు తెలిపారు. పాఠశాల సమయం ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల నుంచి బయటకు వెళ్లరాదని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. పాఠశాల సమయపాలన విషయంలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు, విధుల నిర్వహణను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ నిర్ణీత సమయం వరకు పాఠశాలలో ఉండి విద్యాబోధనతో పాటు పాఠశాలకు సంబంధించిన ఇతర విధులను పూర్తి చేయాలని సూచించారు. ఇటీవల పాఠశాలలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని, అందులో పేర్కొన్న అంశాలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే 11 ప్రభుత్వ పాఠశాలల్లో విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ సందర్భంగా సేకరించిన వివరాలు, గుర్తించిన అంశాలను క్రోడీకరించి విచారణ నివేదికను వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఎంపీడీఓ కే.తిరుమల స్వామి తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల్లో క్రమశిక్షణ, సమయపాలనకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, భవిష్యత్తులో కూడా పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.