ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
- ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
- రెండెకరాల భూమి కేటాయించాలి: మంద కృష్ణ మాదిగ
చిలకలూరిపేట, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు కూడలి వద్ద ప్రైవేటు బస్సు–ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దళిత కూలీలు మృతి చెందిన ఘటనపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం వేలూరు గ్రామానికి వెళ్లి మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల్లో ఆరుగురు మాదిగ మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగి 40 గంటలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడం బాధాకరమన్నారు. బాధితులను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రమాద సమాచారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొనడం తప్ప.. బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో చొరవ చూపలేదన్నారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని మంద కృష్ణ మాదిగ కోరారు. ఒక్కో కుటుంబానికి కనీసం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న ప్రతి కుటుంబానికి రెండెకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల విద్యా బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని, నిరాశ్రయ కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రమాదంలో మృతి చెందిన 17 మంది కూలీల కుటుంబాలకు పరిహారంతోపాటు భూమి కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌లో బియాస్ నది ప్రమాదం, కందుకూరు ఘటనల్లోనూ బాధితులను ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆదుకున్నాయని పేర్కొన్నారు. పేదలు, దళితులు ప్రమాదాల్లో మృతి చెందినప్పుడు ప్రభుత్వం అదే స్థాయిలో స్పందించాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుంటే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా నిరసనలు కొనసాగిస్తామని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.