prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 3:50 am Digital Edition : PRAJA KSHETRAM

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

  • ఆన్‌లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు
  • సొసైటీ కార్యాలయం ముందు ఆగ్రహం.. అధికారులను లోపలే ఉంచి తాళం
  • చివరకు చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన
  • ఆధార్ కార్డుతో నేరుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్

పెద్దేముల్, ఆగస్టు 14(ప్రజాక్షేత్రం):యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు మరోసారి రోడ్డెక్కే పరిస్థితికి దారితీశాయి. యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూసిన రైతులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. చివరకు సహనం కోల్పోయిన రైతులు పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందించడంలో ఉన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సొసైటీకి చేరిన 500 బస్తాలు

పెద్దేముల్ సొసైటీకి గురువారం సుమారు 500 బస్తాల యూరియా చేరింది.వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం రైతులు ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా బుకింగ్ చేసుకునే విధంగా స్టాక్ వివరాలను ఈ-పాస్ మిషన్‌లో పెద్దేముల్ సొసైటీ సిబ్బంది అప్‌డేట్ చేశారు.అయితే సాంకేతిక కారణాలతో యూరియా స్టాక్‌ వివరాలు రైతులకు యాప్‌లో సక్రమంగా కనిపించకపోవడంతో సమస్య మొదలైంది.

గంటల తరబడి పడిగాపులు

యూరియా వస్తుందని ఆశతో ఉదయం నుంచే రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యాప్‌లో స్టాక్ కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సుమారు గంటపాటు వేచి చూసిన అనంతరం యాప్‌లో యూరియా స్టాక్ అందుబాటులోకి వచ్చింది. అయితే రైతులు బుకింగ్ చేసుకునేలోపే స్టాక్ పూర్తయినట్లు చూపించడంతో వారి ఆగ్రహం మరింత పెరిగింది.

‘స్టాక్ ఉంది’ అన్న ఆశ.. క్షణాల్లోనే అయిపోయిందన్న నిరాశ

ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో యూరియా స్టాక్ అందుబాటులోకి వస్తుందని చెప్పడంతో రైతులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ సుమారు గంట తర్వాత స్టాక్ ఆన్‌లైన్‌లో కనిపించిన వెంటనే అయిపోయినట్లు చూపించడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. యూరియా అవసరం ఉన్న ప్రతి రైతుకూ అందకుండా కేవలం ఆన్‌లైన్ ప్రక్రియకే పరిమితం చేయడం తమకు పెద్ద తలనొప్పిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దేముల్ సొసైటీ కార్యాలయానికి తాళం

రైతుల ఆగ్రహం తీవ్రస్థాయికి చేరడంతో సొసైటీ కార్యాలయంలో ఉన్న వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం, సొసైటీ సిబ్బందిని కార్యాలయంలోనే ఉంచి బయట నుంచి తాళం వేసిన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న సొసైటీ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

తాళం ధ్వంసం.. బయటకు వచ్చిన అధికారులు, పెద్దేముల్ సొసైటీ సిబ్బంది

అనంతరం పెద్దేముల్ సొసైటీ సిబ్బంది, వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు కార్యాలయానికి వేసిన తాళాన్ని స్థానిక పోలీసులు పెద్ద రాయితో ధ్వంసం చేసి తెరిచారు. అప్పటికే రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం పెద్దేముల్ చౌరస్తా వద్దకు చేరుకున్న రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు.

రోడ్డుపై రైతుల ఆవేదన

“యూరియా కోసం మేము పంట పొలాలను వదిలి గంటల తరబడి ఇక్కడ పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే సాంకేతిక సమస్యలు.. స్టాక్ కనిపించినా క్షణాల్లో అయిపోయిందని చూపిస్తున్నారు. ఇలా అయితే సాధారణ రైతు యూరియా ఎలా పొందాలి?” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్‌ కంటే ఆధార్‌తో పంపిణీ చేయాలని డిమాండ్

రైతులకు ఆన్‌లైన్ యాప్ ద్వారా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని రైతులు కోరారు.తమ వద్ద ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ వంటి వివరాలు ఉన్నప్పటికీ యూరియా కోసం ఆన్‌లైన్ బుకింగ్‌పై ఆధారపడాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రతి రైతుకూ సమానంగా యూరియా అందేలా ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాన రహదారిపై గంటల తరబడి నిలిచిన వాహనాలు

రైతులు పెద్దేముల్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించడంతో తాండూరు–సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు చాలాసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం అక్కడి చేరుకొన్నా తాండూరు టౌన్ ఎస్ఐ నుమాన్ అలీ, మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం లు రైతులను చాలా సేపు సముదాయించి ధర్నా విరమించేలా స్పష్టమైన హామీ ఇచ్చి సముదాయించారు.

రైతుల బాధను అధికారులు అర్థం చేసుకోవాలి

యూరియా కొరత, ఆన్‌లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు, స్టాక్ క్షణాల్లోనే పూర్తవుతున్న పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక రైతులు పేర్కొన్నారు. రైతులు పంట సాగులో నిమగ్నమై ఉండాల్సిన సమయంలో యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, గంటల తరబడి వేచి ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతుల సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి, ఆన్‌లైన్ విధానంలోని లోపాలను సరిచేసి ప్రతి రైతుకూ అవసరమైనంత యూరియా సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం వివరణ

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యూరియా బస్తాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నాం.ప్రతి రోజు 100 మంది రైతులకు యూరియా ఆన్ లైన్ యాప్ పైనా అన్ని విధాలుగా అవగాహనా కల్పిస్తున్నాం.రైతులకు యూరియా విషయంలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోని యూరియా ఇబ్బందులు లేకుండా చూస్తాం.మరోవైపు రైతులు యూరియాను ఆన్ లైన్ లో యాప్ ద్వారా కాకుండా ఆధార్ కార్డు, పట్టా పాసు బుక్ ద్వారా అందిస్తే యూరియా ఇబ్బందులు పోతాయని వారు తెలుపడం జరిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని తన వివరణలో తెలిపారు.