రైతుల సాగునీటి కల సాకారం..
- కర్నెతండ లిఫ్టు నేడు ప్రారంభం
- ఖిల్లాఘణపురం మండలంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు
వనపర్తి, ఆగస్టు 24(ప్రజాక్షేత్రం):రైతుల సాగునీటి కలను సాకారం చేసే దిశగా కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో ముందడుగు కానుంది. ఖిల్లాఘణపురం మండలంలోని కర్నెతండ వద్ద నిర్మించిన లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డితో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. వీరు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
భారీగా తరలిరావాలని పిలుపు
కర్నెతండ లిఫ్టు ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోరింది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మార్కెట్ యార్డు, సింగిల్‌విండో పాలకవర్గాల ప్రతినిధులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, అనుబంధ సంఘాల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువత, మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతుల సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో చేపట్టిన కర్నెతండ లిఫ్టు ప్రారంభంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించనున్నాయి.