prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:52 am Digital Edition : PRAJA KSHETRAM

వనపర్తి కాంగ్రెస్‌లో రాజకీయ వేడి!

వనపర్తి కాంగ్రెస్‌లో రాజకీయ వేడి!

  • టికెట్‌ వ్యవహారంపై చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం
  • ‘‘డబ్బులు ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నా’’ అన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం
  • ఆరోపణలను నిరూపించాలని సవాల్‌..
  • పీసీసీ, క్రమశిక్షణ కమిటీ, అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడి

వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):వనపర్తి కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి. చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య గత శాసనసభ ఎన్నికల టికెట్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. టికెట్‌ కేటాయింపుపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బులు ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నానన్న ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పీసీసీ, క్రమశిక్షణ కమిటీ, ప్రభుత్వం, ఏఐసీసీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. టికెట్‌ ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేసినా.. గోపాలపేట మండల కేంద్రంలో ఆదివారం మరో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల టికెట్‌ అంశాన్ని ప్రస్తావించారు. తనకు వనపర్తి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, నాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిటీ డబ్బులు తీసుకుని మేఘారెడ్డికి టికెట్‌ ఇచ్చిందని ఆరోపించారు. తనకు టికెట్‌ ఇచ్చి ఉంటే ఎన్నికల్లో విజయం సాధించి, మంత్రి పదవి పొంది వనపర్తి నియోజకవర్గాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేసేవాడినని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

‘‘నేను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలి’’

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను ఎవరికి డబ్బులు ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నానో నిరూపించే బాధ్యత చిన్నారెడ్డిదే’’ అని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీకి, పీసీసీకి, ప్రభుత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు, ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధిష్ఠాన పెద్దలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆరోపణలపై పార్టీ వేదికలపైనే తేల్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

‘‘తొమ్మిదిసార్లు పోటీ చేశారు.. ఎవరికి డబ్బులిచ్చారో చెప్పాలి’’

చిన్నారెడ్డి తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారని పేర్కొన్న మేఘారెడ్డి.. ఆయా సందర్భాల్లో ఎవరెవరికి ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి టికెట్లు పొందారో కూడా ప్రజలకు వివరించాలని ఎదురు సవాల్‌ చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్‌ పొందడం, గెలుపొందడం రెండూ వేర్వేరు అంశాలని అన్నారు.
తనకు టికెట్‌ రాకుండా వేరే వ్యక్తికి ఇచ్చారని చెప్పడం ద్వారా పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని ప్రశ్నించడం సమంజసం కాదని పేర్కొన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్వహించిన సర్వేలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకునే టికెట్లు కేటాయించారని చెప్పారు.

‘‘గెలిచే వారికే టికెట్‌ ఇచ్చారు’’

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని మేఘారెడ్డి అన్నారు. ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీ పరిస్థితి, అభ్యర్థి గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. తనకు టికెట్‌ ఇవ్వడం వెనుక ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. తాను డబ్బులు ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నాననే ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి వాటిని నిరూపించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేరని అన్నారు.

‘‘ఎన్నికల్లో ఎకరం.. రెండెకరాలు అమ్మి ఎక్కడ ఖర్చు చేశారు?’’

ఎన్నికల సమయంలో తాను చేసిన ఖర్చుపై కూడా మేఘారెడ్డి స్పందించారు. ఎన్నికల్లో ఎకరం, రెండు ఎకరాలు అమ్మి ఎక్కడ ఖర్చు చేశారో, ప్రజలకు ఏం ఇచ్చారో కూడా చెప్పాలని చిన్నారెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల ఖర్చులు, రాజకీయ కార్యకలాపాలపై మాట్లాడే ముందు తమ గత రాజకీయ ప్రస్థానాన్ని కూడా పరిశీలించుకోవాలని సూచించారు.

‘‘రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు చిన్నారెడ్డేనట!’’

చిన్నారెడ్డి ఆస్తులపై కూడా మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో చిన్నారెడ్డి కంటే పెద్ద ధనవంతుడు లేడని ఉదయం నుంచి పలువురు ఫోన్లు చేసి చెబుతున్నారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. చిన్నారెడ్డి ఆస్తుల వివరాలపై త్వరలోనే సమగ్రంగా విచారించి ప్రజల ముందుంచుతానని మేఘారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

అధిష్ఠానం దృష్టికి వివాదం

ఇరువురు కాంగ్రెస్‌ నేతల మధ్య చోటుచేసుకున్న తాజా మాటల యుద్ధం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. టికెట్‌ కేటాయింపుపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు, వాటికి
మేఘారెడ్డి ఇచ్చిన కౌంటర్‌ నేపథ్యంలో వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెండు కార్యాలయాల అంశం రాజకీయ చర్చకు దారితీస్తుండగా.. తాజాగా టికెట్‌ వ్యవహారం కూడా తెరపైకి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు నేతల వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది.