విద్యార్థులు రోడ్లపై సమ్మె చేయడం బాధాకరం
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):విద్యార్థుల భవిష్యత్ ను సిఎం రేవంత్ రెడ్డి పాతాళంలోకి తొక్కారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ పై రేవంత్ కు శ్రద్ధ లేదని, డబ్బు సంపాదించుకోవడంపైనే రేవంత్ శ్రద్ధ అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం పాలిటెక్నిక్ చేసి..పాలిటెక్నిక్స్ లోకి వచ్చారని, పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ లోకి పోతే తప్పు ఏంటి? అని విద్యార్థులతో రేవంత్ ఒక్క రోజైనా మాట్లాడారా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని సిఎం మాట్లాడుతున్నారని, పిల్లలను సిఎం దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించాలని అన్నారు. తరగతి గదుల్లో ఉండాల్సిన బిడ్డలు రోడ్లపై ఉన్నారని, విద్యార్థులు రోడ్లపై సమ్మె చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 4వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారని, రూ.400 కోట్లు ఇస్తే పాలిటెక్నిక్ కళాశాలలు బాగుపడతాయని తెలియజేశారు. ఫోర్త్ సిటీ పేరుతో భూ దందా నడుస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.