వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ భూమి తొలగించిన రికార్డులపై సమగ్ర విచారణ జరపాలి
భీంగల్, ఆగష్టు 17(ప్రజాక్షేత్రం):భీంగల్ పట్టణంలోని నందిగల్లి బస్ డిపో వెనుక ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయానికి సంబంధించి తొలగించిన భూమి రెవెన్యూ రికార్డుల విషయంలో సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ శ్రీ బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి సర్వే నంబర్ 675లో 6.0800 ఎకరాలుగా పాత రెవెన్యూ రికార్డులలో నమోదై ఉన్నట్లు వారు తెలిపారు.తమ వద్ద ఉన్న 2011-17 సంవత్సరానికి సంబంధించిన మీసేవ ద్వారా జారీ చేయబడిన ధ్రువీకృత పహాణీ/అడంగల్ పత్రంలో సర్వే నంబర్ 675, విస్తీర్ణం 6.0800 ఎకరాల వివరాలు నమోదై ఉన్నాయని అన్నారు.అలాగే 2012-13 నుండి 2015-16 వరకు ఉన్న పాత రెవెన్యూ రికార్డులలో సదరు భూమి శ్రీ బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన చరాయి భూమిగా నమోదై ఉన్నట్లు తెలిపారు.అయితే 2017 సంవత్సరం నుండి తదుపరి రెవెన్యూ రికార్డులలో సదరు భూమి వివరాలు కనిపించకుండా పోయాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.గతంలో ప్రభుత్వ రెవెన్యూ రికార్డులలో నమోదై ఉన్న భూమి వివరాలు అనంతరం ఏ కారణంతో తొలగించబడ్డాయి? ఎవరి ఆదేశాల మేరకు తొలగించబడ్డాయి? ఏ ఉత్తర్వులు అనగా ప్రొసీడింగ్స్ ఆధారంగా రికార్డులలో మార్పులు జరిగాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరారు.
ఈ సందర్భంగా అధికారులు పాత పహాణీలు, అడంగల్,1-బి, సెత్‌వార్ తదితర రెవెన్యూ రికార్డులతో పాటు ప్రస్తుత డిజిటల్ రికార్డులను పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో నిర్ధారించాలని వారు కోరారు.విచారణలో పాత రికార్డుల ప్రకారం సదరు భూమి శ్రీ బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించినదిగా నిర్ధారణ అయితే, భూమి రికార్డులను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా పునరుద్ధరించి, దేవాలయ భూమికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా రికార్డులలో అక్రమ మార్పులు అనగా తొలగింపులు జరిగినట్లు విచారణలో తేలితే, అందుకు బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ ప్రజావాణి ఫిర్యాదుపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి శ్రీ బ్రహ్మంగారి దేవాలయ భూమికి హద్దులు చూపించి న్యాయం చేయాలని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.