prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 10:25 am Digital Edition : PRAJA KSHETRAM

వేపచెట్టు కోసం 25 ఏళ్లుగా గొడవ ఇద్దరి దారుణహత్య

  • సూర్యాపేట జిల్లా ఎర్రగడ్డ తండాలో విషాదం
  • గొడ్డళ్లతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు
  • అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై నవీన్ కుమార్ కి గాయాలు

సూర్యాపేట ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లాలో ఓ చిన్న వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య రేగిన చిచ్చు… దారుణమైన రక్తపాతానికి దారితీసింది. మాటామాటా పెరిగి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాలు విచక్షణ కోల్పోయి ఏకంగా గొడ్డళ్లతో పరస్పరం దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో గొడ్డలి వేట్లకు గురైన ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన మేళ్లచెరువు ఎస్ఐ నవీన్‌కుమార్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్న చెట్టు వివాదం ఇద్దరి ప్రాణాలు తీయడంతో పాటు పోలీసులకే గాయాలయ్యే స్థాయికి వెళ్లడంతో… ఎర్రగడ్డతండాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.