prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 5:58 am Digital Edition : PRAJA KSHETRAM

సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి

సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి

  • పెద్దేముల్ మండల తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్
  • తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, దాతలకు ప్రతిభా పురస్కారాల అందజేత

పెద్దేముల్, ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):“ప్రభుత్వం, సమాజం మనకు ఏమి ఇచ్చాయనే దానికంటే..ఒక మనిషిగా మనం ప్రభుత్వానికి, సమాజానికి ఏమి ఇస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి” అని పెద్దేముల్ మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్ అన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు, దాతలు తదితరులకు ప్రతిభా పురస్కారాలు, సన్మానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.1857 నుంచి 1947 వరకు సాగిన స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పోరాడారని తెలిపారు.వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. 2026లో దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో సేవా స్ఫూర్తితో పనిచేసిన వారిని గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్ ప్రక్రియ ను విజయవంతంగా నిర్వహించడంలో కీలకంగా పనిచేసిన 46 మంది బూత్ లెవల్ అధికారులు (BLO)లను ఈ సందర్భంగా సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి పురస్కారాలు అందించారు.అదేవిధంగా మండలంలో నిర్వహించే పలు సామాజిక, ప్రజా కార్యక్రమాలకు చేదోడువాదోడుగా నిలుస్తూ సహకరిస్తున్న దాతలు, సహాయకులను సైతం గుర్తించి సన్మానించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు, సమాజ సేవలో ముందుండే వారిని ప్రోత్సహించడం ద్వారా మరింత మందిలో సేవాభావం పెంపొందుతుందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ మాట్లాడుతూ… ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టారని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింసా,శాంతి మార్గాలు భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ఎంతో కీలకంగా పనిచేశాయని, భారతదేశం ప్రపంచంలోనే జనాభా సంపద ఎక్కువగా ఉన్న దేశమని, దాదాపు 20025 సంవత్సరాలు బ్రిటిష్ దేశాల పాలకులు భారతదేశాన్ని పాలించినప్పటికీ, భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో ఎందరో మహనీయులు చేసిన కృషి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు.అనంతరం కార్యక్రమంలో అందరికీ ఘనంగా ప్రతిభా పురస్కారాలను అందించి సన్మానాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్, ఎస్ఐ ఎం. ప్రశాంత్ వర్ధన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్,ప్రముఖ కవి, గజల్, సినీగేయ రచయిత,పీఆర్టీయూ రాష్ట్ర బాద్యులు ద్యావరి నరేందర్ రెడ్డి, పెద్దేముల్ మండల శాఖ పీఆర్టీయూ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్,పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నారాయణ గౌడ్, తట్టేపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కే. నర్సింహులు,పెద్దేముల్ గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి దొర, దాతలు ఎండి.ఆజం ఖాన్, టిపిసిసి మైనారిటీ కన్వీనర్ ఎండి.రియాజ్,ఆయా గ్రామాల బీఎల్ఓలు, జీపీఓలు,ఆయా పాఠశాలల విద్యార్థులు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా కార్యాలయాల సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.