హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
- రెవెన్యూ, పోలీసు అధికారులకు మంబాపూర్, రేగొండి, చైతన్య నగర్ గ్రామాల రైతుల వినతి
- పానాది దారిని పునరుద్ధరించి రక్షణ కల్పించాలని తహసీల్దార్, ఎస్‌ఐలకు వినతిపత్రాలు
పెద్దేముల్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రెవెన్యూ, పోలీసు అధికారులు పక్కాగా అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్, రేగొండి, చైతన్య నగర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు శనివారం మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్, పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్‌లకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ….పెద్దేముల్ మండల పరిధిలోని రేగొండి గ్రామ శివారులో గల సర్వే నంబర్లు 115, 116, 117లో తమ వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు.అయితే చైతన్య నగర్ గ్రామానికి చెందిన కుక్కల హనుమంతు, కుక్కల చిన్నమ్మ అనే ఇద్దరు వ్యక్తులు దశాబ్దాల కాలం నుండి ఉన్న పానాది (వ్యవసాయ దారి)ని ఆక్రమించి మూసివేయడంతో సుమారు 20 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పానాది దారి మూసివేయడం వల్ల తమ పొలాలకు వెళ్లే మార్గం లేక పంటల సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని,దీంతో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం గతంలో తాము తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు పానాది దారి వాస్తవంగా ఉందని నిర్ధారిస్తూ, రైతులు యథావిధిగా ఆ మార్గంలో రాకపోకలు సాగించే హక్కు ఉందని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.కోర్టు ఆదేశాల మేరకు సావిత్రమ్మ, మాదాసు నర్సింహులు, అంజిలప్ప, విష్ణువర్ధన్ రెడ్డి తదితర రైతులతో పాటు ఆ దారిని వినియోగించే రైతులందరికీ ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగేందుకు అవకాశం కల్పించాలని తీర్పులో పేర్కొన్నట్లు వివరించారు. అందువల్ల రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో వ్యవహరించి హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయడంతో పాటు పానాది దారిని పునరుద్ధరించి, రైతులకు రక్షణ కల్పించాలని తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్, ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్‌లను కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులు చట్టపరమైనళ నిబంధనల మేరకు సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.ఈ కార్యక్రమంలో కోట్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సాయిని నారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు మంబాపూరం ప్రకాశం, కుక్కల ఆంజిలయ్య, మాజీ ఉపసర్పంచ్ బిచ్చప్ప, మాజీ వార్డు సభ్యుడు ఎంగూరు బాలప్ప, రైతులు సావిత్రమ్మ, మాదాసు నర్సింహులు , మాదాసు విష్ణువర్ధన్, మాదాసు భీమ్లు, మాదాసు దస్తయ్య, మాదాసు శ్రీనివాసు, సుందర్, రత్నం,తదితరులు పాల్గొన్నారు.
