prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:56 pm Digital Edition : mohan.sabbasani@gmail.com

రూ.5వేల లంచం తీసుకుంటూ జీపీఓ పట్టివేత

* పేరు సవరణ నివేదికకు లంచం డిమాండ్

* ఏసీబీ వలలో చిక్కిన ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి

కరీంనగర్/జగిత్యాల, ఆగస్టు 06 (ప్రజాక్షేత్రం) : పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి (జీపీఓ) మాతే రాజేష్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి పేరు సవరణ ప్రక్రియలో విచారణ నివేదికను పంపించేందుకు మాతే రాజేష్ రూ.5 వేల లంచం కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఆత్మకూర్ గ్రామ పాలన కార్యాలయంలో నిఘా ఏర్పాటు చేశారు. ఏసీబీ సూచనల మేరకు ఫిర్యాదుదారుడు రూ.5 వేల నగదును జీపీఓ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచగా, వెంటనే అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో హ్యాండ్‌బ్యాగ్‌కు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగిగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా లంచం స్వీకరించినందుకు మాతే రాజేష్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అతడిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.