గుక్కెడు నీటి కోసం గోడు..రోడ్డుపై కందనెల్లి తండా వాసుల నిరసన
- బిందెడు నీటి కోసం..రహదారిపై తండా ప్రజల బైఠాయింపు!
- ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు, గ్రామస్తులు
- తాగునీటి కోసం కందనెల్లి తండా వాసుల ఆందోళన
- 2 గంటల పాటు స్తంభించిన తాండూరు–సంగారెడ్డి రహదారి
- పైప్‌లైన్ లీకేజీతోనే అంతరాయం.. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం: ఎంపీడీవో కే.తిరుమల స్వామి
పెద్దేముల్, సెప్టెంబర్ 01(ప్రజాక్షేత్రం):ఒకవైపు ఇంట్లో వంట చేసుకోవడానికి నీరు లేదు.. మరోవైపు తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకులాట..రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడంతో కందనెల్లి తండా వాసుల సహనం నశించింది. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలను చేతబట్టి ఏకంగా ప్రధాన రహదారిపైకి వచ్చారు. అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాండూరు–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయి, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడి వాహనాలు అక్కడే సుమారు 2 గంటల పాటు నిలిసిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలు చేరడానికి నానా అవస్థలు పడ్డారు.
పది రోజులుగా నీటి కష్టాలు
కందనెల్లి తండాలో గత పది రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ నుంచి నీరు రావడం లేదని, మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.
ప్రధాన తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులు చేపట్టడంలో జాప్యం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న బోర్లు, మోటార్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నీటి కోసం నిత్యం పరుగులు
ఇంట్లో తాగునీరు లేకపోవడంతో పాటు వంట చేసుకునేందుకు కూడా నీరు అందుబాటులో లేకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. నీటి కోసం ప్రతిరోజూ బోర్ల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ తమకు సరైన స్పందన లభించలేదని కొందరు గ్రామస్తులు ఆరోపించారు. సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం కాలేదని పేర్కొంటూ తక్షణమే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రెండు గంటల పాటు తాండూరు -సంగారెడ్డి రహదారి దిగ్బంధం
తాగునీటి సమస్య పరిష్కారం కోసం కందనెల్లి తండా గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో తాండూరు–సంగారెడ్డి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన ఎంపీడీవో కే.తిరుమల స్వామి
ఆందోళన విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎంపీడీవో కే.తిరుమల స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. తాగునీటి సమస్యకు గల కారణాలను వివరించారు. ప్రధాన తాగునీటి పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడటంతో గత రెండు రోజులుగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించినట్లు తెలిసింది.అంతకుముందు స్థానిక పోలీసులు నీటి కోసం ధర్నాకు దిగిన కందనెల్లి తండా గ్రామస్థులను సముదాయించడానికి చాలా సేపు ప్రయత్నం చేశారు ఆయన ఫలితం లేకుండా పోయింది.
ఆందోళన వెనుక దురుద్దేశం ఉందంటున్న సర్పంచ్
మరోవైపు కందనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్ గ్రామస్తుల ఆరోపణలను ఖండించారు. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో తనపై బురదజల్లేందుకు ఆందోళనకు దిగారని ఆరోపించారు. కేవలం రెండు రోజులుగా పైప్‌లైన్ మరమ్మతుల కారణంగానే తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా నీటిని అందించే ఏర్పాట్లు కూడా చేశామని సర్పంచ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో ప్రధాన రహదారిపైకి వచ్చి ఆందోళన చేయడం వల్ల ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు.
శాశ్వత పరిష్కారం ఎప్పుడో?
కందనెల్లి తండాలో తాగునీటి సమస్య తాత్కాలికంగా పరిష్కారమైనా.. తరచూ పైప్‌లైన్ సమస్యలు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తండావాసులు కోరుతున్నారు. పైప్‌లైన్ మరమ్మతులు పూర్తయిన తర్వాత నీటి సరఫరా సక్రమంగా కొనసాగించేలా అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాగునీరు అనేది ప్రతి కుటుంబానికి ప్రాథమిక అవసరమని, దాని కోసం ప్రజలు ప్రధాన రహదారిపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎంపీడీవో ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల్లో నీటి సరఫరా పునరుద్ధరణ అవుతుందా? లేక సమస్య మళ్లీ పునరావృతమవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.అదే విధంగా కందనెల్లి తండా గ్రామానికి పర్మినెంట్గా ఓ పంచాయతీ కార్యదర్శిని నియమించి గ్రామంలోని ప్రజలకు మౌలిక సదుపాయాల దృష్ట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల అధికారులు చొరవ చూపాలని గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కందనెల్లి తండా గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

