prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:30 pm Digital Edition : PRAJA KSHETRAM

గొట్లపల్లి పంచాయతీపై అధికారుల ఫోకస్‌.. ‘ప్రజాక్షేత్రం’ ఎఫెక్ట్‌

  • ‘ప్రజాక్షేత్రం’ కథనానికి స్పందించిన జిల్లా జెడ్పీ సీఈఓ, డీపీఓ
  • రెండు అంశాల్లో వేరువేరుగా నివేదికలు సమర్పించిన మండల అధికారులు
  • గొట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పరమేష్ కు రెండు అంశాల్లో మెమోలు జారీ
  • ‘ప్రజాక్షేత్రం’ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం
  • పేమెంట్‌ బిల్లుల, రికార్డుల నిర్వహణ వ్యవహారంపైనా డీపీఓకు నివేదికలు
  • లిఖితపూర్వక వివరణలు సేకరించి డీపీఓ
  • కార్యాలయానికి నివేదికలు పంపిన ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్

పెద్దేముల్, సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీలో రికార్డుల నిర్వహణపై ‘ప్రజాక్షేత్రం’ దినపత్రికలో ఈ నెల 14న ప్రచురితమైన “బిడ్డ పుట్టాక పెళ్లి సర్టిఫికెట్‌.. గొట్లపల్లిలో రికార్డుల గందరగోళం” అనే కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. కథనంలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించిన జిల్లా జడ్పీ సీఈఓ, డీపీఓ సంబంధిత విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మండల అధికారులను ఆదేశించినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్‌లు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పరమేష్‌కు ఈ నెల 15వ తేదినాడు ఎంపీఓ రతన్ సింగ్ మెమో జారీ చేసి, రికార్డులకు సంబంధించిన అంశంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శి నుంచి లిఖితపూర్వక వివరణ

పెద్దేముల్ ఎంపీఓ రతన్ సింగ్ జారీ చేసిన మెమోకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి పరమేష్ తన వివరణను లిఖితపూర్వకంగా సమర్పించినట్లు ఎంపీఓ తెలిపారు. కార్యదర్శి అందించిన వివరణను నివేదిక రూపంలో రూపొందించి జిల్లా పంచాయతీ కార్యాలయానికి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ వివరణలో రికార్డుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కార్యదర్శి తన వివరణను వివరించినట్లు సమాచారం.

పేమెంట్‌ బిల్లులపైనా విచారణ

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12వ తేదీన “ప్రజాక్షేత్రం” దినపత్రికలో ప్రచురించిన “పనిచేసింది నవీన్… పేమెంట్ మమత పేరుతోనా?” అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై విచారణ జరపాలని మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్ లను ఆదేశించారు. ఈ మేరకు ఎంపీఓ రతన్ సింగ్ గొట్లపల్లి గ్రామపంచాయతీలో పేమెంట్‌ బిల్లులకు సంబంధించి వచ్చిన ఆరోపణలపైనా పంచాయతీ కార్యదర్శి పరమేష్ కు మెమో జారీ చేశారు. పూర్తిస్థాయిలో బిల్లులు, చెల్లింపులకు సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం రూపొందించిన నివేదికను పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామికి అందజేసినట్లు ఎంపీఓ రతన్ సింగ్ తెలిపారు. ఎంపీడీఓ కే.తిరుమల స్వామి ఆ నివేదికను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయానికి పంపించినట్లు కూడా రతన్ సింగ్ వెల్లడించారు.

అధికారుల పరిశీలనతో వెలుగులోకి అంశాలు

‘ప్రజాక్షేత్రం’ దినపత్రికలో గొట్లపల్లి గ్రామపంచాయతీ లో జరిగిన పలు అంశాలపై వరుస కథనాలు ప్రచురితమైన అనంతరం జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించడం, సంబంధిత పంచాయతీ కార్యదర్శి నుంచి లిఖితపూర్వక వివరణ కోరడం, పేమెంట్‌ బిల్లుల వ్యవహారంపైనా విచారణ జరిపి నివేదికలు ఉన్నతాధికారులకు పంపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రికార్డుల నిర్వహణలో జరిగిన పొరపాట్లకు కారణాలు ఏమిటి? సంబంధిత రికార్డుల్లో నమోదైన వివరాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా ? పేమెంట్‌ బిల్లుల వ్యవహారంలో ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే అంశాలపై ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారుల విచారణ, సమర్పించిన నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది అప్పటివరకు వేచి చూడాల్సి ఉంది.