prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:51 am Digital Edition : PRAJA KSHETRAM

తహసీల్దార్‌ కోసం ప్రజల పడిగాపులు

  • మధ్యాహ్నం 12.20 అయినా అందుబాటులో లేని అధికారి..
  • పనుల కోసం వచ్చిన వారికి నిరీక్షణ

శంకర్‌పల్లి, సెప్టెంబర్‌ 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజలకు అధికారుల అందుబాటు ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయం దాటినా తహసీల్దార్‌ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. భూ సమస్యలు, ధ్రువపత్రాలు, రెవెన్యూ సంబంధిత పనులు తదితర అంశాలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఉదయం నుంచే కార్యాలయానికి వచ్చిన కొందరు తహసీల్దార్‌ కోసం ఎదురుచూస్తూ కనిపించారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారి అందుబాటులో లేకపోవడంతో సమయం, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు తమ పనులపై స్పష్టమైన సమాచారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాల్సి ఉంది.