తృటిలో తప్పిన ప్రాణాపాయం
- ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ఘటన
శంకర్‌పల్లి, సెప్టెంబరు 24(ప్రజాక్షేత్రం):వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు విగ్రహంతోపాటు వాగులో పడిపోయిన ఘటన శంకర్‌పల్లి మున్సిపల్ ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా అదుపుతప్పిన యువకుడు విగ్రహంతో సహా నీటిలో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యువకుడు నీటిలో కాకుండా కింద ఉన్న కఠిన ప్రదేశంలో పడితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై చర్చ జరుగుతోంది. బ్రిడ్జి వద్ద రక్షణ చర్యలు, బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారా? నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన తర్వాత కాకుండా ముందుగానే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిమజ్జన సమయంలో యువత, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.