prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 2:16 am Digital Edition : PRAJA KSHETRAM

తెలంగాణది విలీన దినోత్సవమే..

  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
  • కాంగ్రెస్‌ పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు.
  • శిల్పకళ.. వృత్తి నైపుణ్యాలకు విశ్వకర్మ ఆదర్శం.

వనపర్తి, సెప్టెంబరు 17(ప్రజాక్షేత్రం):తెలంగాణ ప్రజలు సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా కాకుండా ముమ్మాటికీ విలీన దినోత్సవంగా జరుపుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా వనపర్తిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయంలో నిర్వహించిన శ్రీ విరాట్‌ విశ్వకర్మ మహాయజ్ఞంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

భారత యూనియన్‌లో విలీనం

ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాటి నిజాం సంస్థానం 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. ప్రజాస్వామ్యం, హక్కులు, జాతీయ సమైక్యత కోసం ఎందరో పోరాటాలు చేసి అమరులయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17కు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, అందుకే ఈ రోజును విలీన దినోత్సవంగా పాటించాలనేది బీఆర్‌ఎస్‌ అభిప్రాయమని తెలిపారు.
కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్‌ దెబ్బతీస్తూనే ఉందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్‌ కోతలు, సాగునీటి కొరత, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ సమస్యలు ఎదురవుతున్నాయని, రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

విశ్వకర్మ ఆదర్శంగా నిలిచారు

అనంతరం బ్రహ్మంగారి దేవాలయంలో శ్రీ బ్రహ్మంగారి దేవాలయ అభివృద్ధి కమిటీ, పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విరాట్‌ విశ్వకర్మ మహాయజ్ఞంలో నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశ్వకర్మ సంఘం ప్రతినిధులు నిరంజన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

వృత్తి నైపుణ్యాలకు మార్గదర్శి

శ్రీ విరాట్‌ విశ్వకర్మ జగద్గురువు సర్వ వృత్తులకు మూలపురుషుడిగా భావించబడుతున్నారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. శిల్పకళ, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వృత్తి నైపుణ్యాలకు విశ్వకర్మ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. విశ్వకర్మ సమాజం తమ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, వృత్తి నైపుణ్యాలను భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌, పలుస రమేష్‌గౌడ్‌, నందిమల్ల అశోక్‌, గంధం పరంజ్యోతి, వనం రాములు, దిలీప్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంకటస్వామి, శివరామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ మహాయజ్ఞంలో నందిమల్ల అశోక్‌, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణచారి, యాదాచారి, స్వర్ణకార సంఘం ప్రతినిధులు బంగారు అనిల్‌కుమార్‌, శ్యాంసుందర్‌ ఆచారి, మోహన్‌చారి, పి.నవీన్‌ ఆచారి, కపిలవాయి ప్రసాద్‌, అనిల్‌, జాయిని మధు తదితరులు పాల్గొన్నారు.