prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 5:26 pm Digital Edition : PRAJA KSHETRAM

నిషేధిత భూముల నుంచి విముక్తి కల్పించాలి

నిషేధిత భూముల నుంచి విముక్తి కల్పించాలి

  • 22-ఏ భూములపై బీఆర్‌ఎస్‌ నిరసన

కాప్రా, సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం):22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం కాప్రా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏళ్లుగా భూములపై హక్కులు ఉన్నప్పటికీ 22-ఏ జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగక భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సమస్యగా పరిగణించి అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 22-ఏ భూముల విముక్తి కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.