prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 2:40 pm Digital Edition : PRAJA KSHETRAM

నేడు అడవిలో కొలువుదీరిన అంబురామేశ్వరుడి జాతర ఉత్సవాలు

నేడు అడవిలో కొలువుదీరిన అంబురామేశ్వరుడి జాతర ఉత్సవాలు

  • నేడు శ్రావణమాసం చివరి సోమవారం ఘనంగా జరుగనున్న జాతర ఉత్సవాలు
  • కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
  • భక్తుల భద్రతకు పటిష్ట పోలీసు బందోబస్తు
  • పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్

పెద్దేముల్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలో విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ఉత్సవాలు నేడు శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వైభవంగా జరుగనున్నాయి. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో కొలువుదీరిన స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడనుంది. జాతరను పురస్కరించుకుని ఆలయ కమిటీ పెద్దలు, సభ్యులు, గ్రామస్తులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక సందడిని సంతరించుకున్నాయి.

త్రేతాయుగం నాటి ఆలయంగా విశ్వాసం

అడవుల్లో ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో వెలసిన శ్రీ అంబురామేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని స్థానిక భక్తులు విశ్వసిస్తారు. త్రేతాయుగం నాటి ఆలయంగా భావించే ఈ క్షేత్రంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఏటా శ్రావణమాసం చివరి సోమవారం నిర్వహించే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

నేడు జాతరకు కర్ణాటక నుంచి భారీగా భక్తుల రాక

జాతరకు తాండూరు, వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, చించోలి, బీదర్, కుంచారం, షాదీపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది.

పల్లకీ సేవతో ప్రారంభమైన ఉత్సవాలు

జాతరలో భాగంగా ఆదివారం రాత్రి తట్టేపల్లి గ్రామం నుంచి స్వామివారిని పల్లకిలో ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. నేడు సోమవారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం స్వామివారిని తిరిగి తట్టేపల్లి గ్రామానికి తీసుకురావడంతో ప్రధాన జాతర ముగియనుంది. అనంతరం తట్టేపల్లి గ్రామంలో దుకాణ సముదాయాలతో మరో జాతర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.భజనలు, పూజలు, అభిషేకాలతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి.

ఐదు ఆకుల పుండీకూరకు ప్రత్యేక గుర్తింపు

అంబురామేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సహజసిద్ధంగా లభించే ఐదు ఆకుల పుండీకూరకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కూరను వంట చేసుకుని తింటే స్వామివారి కృపతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని స్థానిక భక్తుల విశ్వాసం.ఈ కూర విత్తనాలను ఇతర ప్రాంతాల్లో పెంచేందుకు ప్రయత్నించినా అక్కడ మొలకెత్తలేదని స్థానికులు చెబుతున్నారు.

పటిష్ట పోలీసు బందోబస్తు : ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ పరిసరాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జాతర నిర్వహిస్తున్నందున భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో మద్యం విక్రయాలు, బెల్ట్‌ షాపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, ఎవరైనా చట్టవిరుద్ధంగా మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జాతర ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.

భక్తుల రాకతో పండుగ వాతావరణం

శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా జరుగుతున్న అంబురామేశ్వర స్వామి జాతరతో తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో నిండిపోనున్నాయి భక్తుల రాకతో అడవీ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించునున్నారు.