prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 3:58 am Digital Edition : PRAJA KSHETRAM

పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.

  • రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు.
  • నిజామాబాద్ రూరల్ లో బాజిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి
  • బాజిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి
  • పోతంగల్ బీఆర్ఎస్ మీటింగ్ లో మండలానికి చెందిన ఒక్క కార్యకర్త లేడు
  • ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్

పోతంగల్, సెప్టెంబర్ 08(ప్రజాక్షేత్రం):మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పోతంగల్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవడంలో తప్పులేదని, అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిపై వ్యక్తిగతంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పోతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోతంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ… పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో సేవలందించిన సీనియర్ నాయకుడని అన్నారు. వందల కోట్ల నిధులు తీసుకువచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి అని అన్నారు. అలాంటి నాయకుడిపై గౌరవం లేకుండా మాట్లాడటం బాజిరెడ్డి గోవర్ధన్ స్థాయికి తగదని విమర్శించారు.
ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోందని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, నాయకులు పరస్పర గౌరవాన్ని పాటిస్తూ హుందాగా విమర్శలు చేసుకోవాలని సూచించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పై అనిచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బాజిరెడ్డి గోవర్ధన్ వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని పోతంగల్ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పోచారం అభివృద్ధి చేసిన సమయంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్న నిజామాబాద్ రూరల్ కు ఎంత అభివృద్ధి చేశారు చెప్పాలని ప్రశ్నించారు. పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా, సభ కార్యక్రమాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని అందులో పోతంగల్ నుండి ఒక్క కార్యకర్త కూడా లేడని ఎద్దేవా చేశారు. పోతంగల్లో ఒక్క కార్యకర్త కూడా వీరికి మద్దతు ఇవ్వకపోతే ఎక్కడి నుండో మనుషుల్ని తీసుకొచ్చి ప్రోగ్రాం చేశారని చెప్పారు. పోతంగల్ ప్రజలందరూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నారని ఇకనైనా బిఆర్ ఎస్ నాయకులు అతి తెలివితేటలు మానుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు షాజీ పటేల్, కల్లూరు సర్పంచ్ రామిరెడ్డి, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ ఎంపీటీసీ కేశ వీరేశం, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, పోతంగల్ ఉప సర్పంచ్ నబీ, పోతంగల్ మాజీ సర్పంచ్ వర్ణిశంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ నీరెడీ గంగాధర్, సోంపూర్ సంజీవ్ పటేల్, ఫుల్కంటి సాయిలు, ధనరాజ్, గంధపు దత్తు, సురారెడ్డి, గంట్ల విఠల్, గంట్ల రవి, శివరాజ్ పటేల్,లింగం, సంజు, మన్సూర్‌, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.