prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 6:32 pm Digital Edition : PRAJA KSHETRAM

బుడ్డగూడెంలో ఆగని ఇసుక రవాణా..!

  • ఎవరి అండదండలతో కొనసాగుతోంది?
  • చర్యలకు అధికారులు ఎందుకు వెనుకడుగు?

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సోంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుడ్డగూడెంలో ఇసుక రవాణా వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకూ ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తారు రోడ్డు కాస్తా మట్టి రోడ్డుగా మారింది!

బుడ్డగూడెం నుంచి సోంపల్లి–మొరంపల్లి బంజర వైపు వెళ్లే రహదారిపై ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు అధికం కావడంతో రోడ్డు పరిస్థితి దారుణంగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. ఒకప్పుడు తారురోడ్డుగా ఉన్న మార్గం ప్రస్తుతం ఇసుక లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో మట్టి రోడ్డును తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రహదారి దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఎవరి అండదండలు ఉన్నాయంటూ ప్రశ్నలు

బుడ్డగూడెంలో ఇసుక రవాణా ఇంత బహిరంగంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారమే తరలింపు జరుగుతోందా? అన్న విషయాలను అధికారులు స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇసుక ట్రాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరి అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతోందో అధికారులు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వంపై విమర్శలు

ఇసుక రవాణాపై ఫిర్యాదులు, ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత శాఖలు స్పందించకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రహదారులు దెబ్బతింటున్నా, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి బుడ్డగూడెంలో జరుగుతున్న ఇసుక రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలితే సంబంధిత వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక రవాణా విషయంలో అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.