మాటల మనిషి కాదు.. చేతల నాయకుడు!
- మాట నిలబెట్టుకున్న రియల్ లీడర్
- సొంత నిధులతో జీవన్‌గూడ రోడ్డు పనులు
- ఆరు నెలల్లోనే హామీ నెరవేర్చిన కౌన్సిలర్
- 9వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా: కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్
మొయినాబాద్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):రాజకీయాల్లో నాయకులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఇచ్చిన మాట కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ అభివృద్ధి పనులను ప్రారంభించే నిజమైన ప్రజానేతలు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన నాయకుడే మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్. ఎన్నికల సమయంలో ఏన్కేపల్లి అనుబంధ గ్రామం జీవన్‌గూడ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు మొయినాబాద్ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో జీవన్‌గూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని చూసి చలించిపోయిన ప్రభాకర్ యాదవ్ తాను గెలిచిన ఆరు నెలల్లోగా తన సొంత నిధులతోనే సీసీ రోడ్డు వేయిస్తానని బహిరంగంగా శపథం చేశారు. ప్రజలు ఆయనను గెలిపించి ఆదరించగా, అధికారం చేపట్టిన సరిగ్గా ఆరు నెలల వ్యవధిలోనే ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ జీవన్‌గూడలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఒక్క రూపాయి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా, తన జేబులోని సొంత డబ్బులతో ఈ పనులను స్వయంగా ప్రారంభించి గ్రామ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడమే తన జీవితాశయమని స్పష్టం చేశారు. “నేను పదవుల కోసం ఆశపడి రాజకీయాల్లోకి రాలేదు, ప్రజల కష్టాలు తీర్చడమే నా ధర్మంమన్నారు. జీవన్‌గూడ ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేకనే నా సొంత నిధులతో ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నామని ఇక్కడితో ఆగిపోను నా 9వ వార్డులో ఏ ఒక్క సమస్య ఉన్నా విడతలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోనే నా వార్డును నంబర్ వన్ ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రభాకర్ యాదవ్ తీసుకున్న ఈ చొరవను చూసి జీవన్‌గూడ గ్రామస్తులు, స్థానిక ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బి బ్బవుతున్నారు. దశాబ్దాలుగా తమను పట్టించుకోని ఎందరో నాయకుల మధ్య, మాట ఇస్తే ప్రాణం పెట్టి నిలబెట్టుకునే ఇలాంటి లీడర్ దొరకడం తమ అదృష్టమని గ్రామస్తులు కొనియాడు తున్నారు. కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ చేస్తున్న ఈ సామాజిక సేవను అభినందిస్తూ స్థానికులు ఆయనకు ఘనంగా నీరాజనాలు పలికారు.