prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 6:14 pm Digital Edition : PRAJA KSHETRAM

మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి.

  • డప్పును, మాదిగలను అవమానించారు.
  • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్.

హైదరాబాద్ సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):సంధ్యారావు అనే వ్య‌క్తిని సృష్టించింది ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డేనని, డప్పును.. మాదిగలను అవమానించినందుకు మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మాదిగలు ఎవరి చావును కోరుకోరని, డప్పు..! మనిషి బతకాలని చెప్పే తమ సంస్కృతిలో భాగమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంధ్యారావు ఎవరో, ఆమెను ఎవరు సృష్టించారో రాష్ట్ర ప్రజలు అన్వేషిస్తున్నారని అన్నారు. సంధ్యారావు పేరుతో మహిళ ఫొటో, పురుషుడి వాయిస్‌తో ఉన్న పోస్టును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. లక్షలాది సోషల్‌ మీడియా పోస్టులు ఉండగా.. ముఖ్యమంత్రికి సంధ్యారావు పోస్టే ఎలా దొరికిందని ప్రశ్నించారు. గత 3 రోజులుగా తెలంగాణ అబద్ధాలతో మునిగిపోయిందని ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలు, 22ఏ, పాలిటెక్నిక్‌, రెవెన్యూ తదితర అంశాలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని దాడులు చేశారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల వద్ద పురుష పోలీసులను, పురుష ఎమ్మెల్యేల వద్ద మహిళా పోలీసులను పెట్టి వివాదాస్పద పరిస్థితులు సృష్టించారన్నారు. ఓ ఎమ్మెల్సీ ఆవేశంలో మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని దళితులను అవమానించారంటూ కేసులు పెట్టారని చెప్పారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కాంగ్రెస్‌ నాయకులే దళిత దళిత అంటూ అవమానించారని, ఆయన తల్లిని ఎవరూ ఏమీ అనలేదని అన్నారు. సీతక్క పదేపదే ఆ అంశాన్ని ప్రస్తావించి స్పీకర్‌ను బాధించారని విమర్శించారు. తాతా మధు నేరుగా స్పీకర్‌ను తిట్టలేదని పోలీస్‌ రిపోర్టే చెప్పిందని, కోర్టు కూడా కేసును కొట్టివేసిందన్నారు. అనంతరం రేవంత్‌ రెడ్డి సూచనతోనే షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కేసీఆర్‌ చావు కోరుతూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

డప్పు.. మాదిగల ఆత్మగౌరవం

మాదిగలు ఎప్పుడూ మనిషి చావును కోరుకోరని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఆదిమ మానవుడి కాలం నుంచి ప్రమాదాల నుంచి రక్షణకు, సమాచారాన్ని చేరవేయడానికి డప్పు ఉపయోగపడిందన్నారు. పెళ్లిళ్లు, పోచమ్మ పండుగలు, చాటింపులు, చావులు, పోరాటాల్లో డప్పు భాగమైందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ లక్షలాది డప్పులు పెత్తందార్లకు వ్యతిరేకంగా మోగాయని, డప్పు తిరుగుబాటు బావుటా అని పేర్కొన్నారు. డప్పు తమ సంస్కృతి, ఆయుధం, ఆభరణమని అన్నారు. వేయి డప్పుల ర్యాలీకి వేముల వీరేశం, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, తూంకుంట నరసా రెడ్డి, బీర్ల ఐలయ్య తదితరులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మాదిగలు ఎవరి చావునూ కోరుకోరని, రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని, వాటిని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరారు. మాదిగలు, దళితులు, మహిళలకు వ్యతిరేకంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో అమలు చేసిన దళిత బంధు, 3 ఎకరాల భూ పంపిణీ, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం, కళ్యాణ లక్ష్మి, గురుకులాలు, సాంస్కృతిక సారధి వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. 22ఏ పేరుతో ఎస్సీల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. డప్పు కళాకారులకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయ్ ఆర్య క్షత్రియ తదితరులు పాల్గొన్నారు‌