prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:39 pm Digital Edition : PRAJA KSHETRAM

యూరియా ఇవ్వడానికి చేతకానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

యూరియా ఇవ్వడానికి చేతకానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

  • రైతుల వెన్నంటి నిలిచింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
  • బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు భరోసా..
  • కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలే..
  • యూరియా కోసం రైతుల అవస్థలు
  • తాండూరుకు రూ.1,680 కోట్ల నిధులు తెచ్చాం
  • పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు సమరభేరిలో
  • తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి

పెద్దేముల్‌, సెప్టెంబర్‌ 03(ప్రజాక్షేత్రం):రైతులకు యూరియా ఇవ్వడానికి చేతకానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని,బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్‌ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దేముల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమరభేరి కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ….
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.ముఖ్యంగా రైతులకు రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం, రైతుబీమా ద్వారా రైతు మృతి చెందితే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రతి 5 వేల మంది రైతులకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి, రైతువేదికల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ హామీలు ఎక్కడ..?

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రోహిత్‌రెడ్డి విమర్శించారు.రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని,రైతుబంధు సక్రమంగా అందడం లేదని,ధాన్యానికి ప్రకటించిన రూ.500 బోనస్‌ కూడా అందడం లేదని ఆరోపించారు.రైతుల పంటలను కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదని అన్నారు.100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రస్తుతం 1000 రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో రైతుకు రైతు భరోసా ద్వారా 4 ఎకరాల రైతుకు రూపాయలు ఒక లక్ష రెండు వేల రూపాయలు బాకీ పడిందని రుణమాఫీ ద్వారా రెండు లక్షలు బాకీ పడిందని అన్నారు. వరి పంటకు రూపాయలు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రతి ఎకరానికి రూపాయలు రూ.12,500 హామీ, 6 పంటలకు ప్రతి ఎకరాకు రూ.75 వేల రూపాయలు రైతులకు బాకీ పడిందని అన్నారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12 వేల రూపాయల హామీ ఇచ్చి రెండు సంవత్సరాలకు రూ.24 వేల రూపాయల బాకీ పడిందని గుర్తు చేశారు.

యూరియా కోసం రైతుల అవస్థలు

రాష్ట్రంలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ప్రతిరోజూ ఎరువుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోహిత్‌రెడ్డి అన్నారు.రైతులు పంటలు సాగు చేసే సమయంలో విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,పాముకాట్ల ఘటనలు సైతం మళ్లీ పెరుగుతున్నాయని ఆరోపించారు.రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు,వారికి అండగా నిలిచేందుకు రైతు సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

రైతులు, మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గ్రామాలకు వస్తే ఇచ్చిన హామీలను గుర్తు చేసి నిలదీయాలని రైతులు,మహిళలు,యువతకు రోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు, బూటకపు మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.

ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తాండూరుకు రూ.1,680 కోట్ల నిధులు

తాను తాండూరు ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేసే అవకాశం లభించినప్పటికీ రెండేళ్లు కరోనా పరిస్థితుల్లో, మరో ఏడాది ఎన్నికల ప్రక్రియలో గడిచిపోయిందని రోహిత్‌రెడ్డి తెలిపారు.కేవలం రెండేళ్ల సమయంలోనే అప్పటి సీఎం కేసీఆర్‌ సహకారంతో తాండూరు నియోజకవర్గానికి సుమారు రూ.1,680 కోట్ల నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. తట్టేపల్లి ప్రాంతానికి ఒక టీఎంసీ సాగునీరు తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించామని, కోట్ పల్లి ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు రూ.100 కోట్ల నిధులు వచ్చేలా కృషి చేశామని గుర్తు చేశారు. తాము నిధుల కోసం ప్రయత్నిస్తే ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు తామే నిధులు తెచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.తాండూరు నియోజకవర్గంలో వారం రోజులపాటు ప్రత్యేక కార్యాచరణతో అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రోహిత్‌రెడ్డి తెలిపారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అండగా ఉంటామని, మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం బీఆర్ఎస్ కార్యకర్త బ్యాగరి వెంకటయ్య తండ్రి బ్యాగరి నర్సప్ప ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ పొలాన్ని పరిశీలించి అక్కడున్న స్థానిక రైతులతో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేము గ్రామ సర్పంచ్ డివై. నర్సింహులు,పెద్దేముల్ మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు డివై.ప్రసాద్, పెద్దేముల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చాకలి రంగయ్య, పెద్దేముల్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రుద్రారం గోపాల్ రెడ్డి,టి.రమేష్,జనార్దన్ రెడ్డి,మారేపల్లి వెంకట్ రెడ్డి,ధన్ సింగ్, చిట్లపల్లి అంజయ్య,తలారి వీరప్ప,వెంకటేష్ చారి,మన్ సాన్ పల్లి రవి,బుద్దారం సర్పంచ్ లక్ష్మప్ప,హీరాసింగ్, డీలర్ అంజయ్య, లక్ష్మణ్, రాములు, పెద్దేముల్ మండల, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సీనియర్, యువ నాయకులు,పార్టీ కార్యకర్తలులు,ఆయా గ్రామాల రైతులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.