రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ ధర్నా
శంకర్‌పల్లి, సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం శంకర్‌పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు, సొసైటీ ఛైర్మన్ బద్దం శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో 22(ఎ) నిషేధిత భూముల సమస్య పరిష్కారం, రైతు బీమా, రైతు భరోసా, విద్యుత్తు, యూరియా కొరత తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గండిచర్ల గోవర్దన్‌రెడ్డి, బద్దం శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ధర్మానగారి గోవర్ధన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులను రాజులుగా చూడాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతుబీమా, రైతుభరోసా, నిరంతర విద్యుత్తు వంటి పథకాలు అమలు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రైతుభరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని, సాగునీటి కొరతతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని కోరారు. రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగించాలని, ప్రత్యేక రైతు విద్యుత్తు పంపిణీ సంస్థల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిన్న నర్సింలు, మాజీ సర్పంచ్ బిస్సోల శ్రీధర్, వాసుదేవ్ కన్నా, మాజీ ఎంపిటిసి యాదగిరి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.